Revanth Reddy: ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవంలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు. ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ, జీసీసీ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్ (Lindy Cameron) ను కోరారు. ఆమెతో సచివాలయం లో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తమ ప్రభుత్వం తేనున్న నూతన విద్యావిధానం ముసాయిదాను వివరించారు. యునైటెడ్ కింగ్‌డమ్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ (Hyderabad) నుంచి అక్కడి యూనివర్సిటీలను నిర్వహించేలా చూడాలని లిండీ కామెరూన్‌ను కోరారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తులపై బ్రిటిష్ హై కమిషనర్ లిండీ స్పందిస్తూ మూసీ (Musi) పునరుజ్జీవనంలో భాగస్వామ్యంతో పాటు ఫార్మా, నాలెడ్జ్, జీసీసీ, అకాడమీ విభాగాల్లో పెట్టుబడులపై సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వోపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణిచ్చేందుక్కూడా సుముఖత వ్యక్తం చేశారు. విద్య, సాంకేతికత రంగాల్లో సహకారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ గాంరెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, మరో అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.