Budda Rajasekhara Reddy: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం..

శ్రీశైలం (Srisailam) టీడీపీ (TDP) ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి (Budda Rajasekhara Reddy) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయనపై పోలీసులు తీవ్రమైన నేరపూరిత కేసులు నమోదు చేశారు. అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కూడా కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ఒకసారి అరెస్టు అయితే తక్షణ బెయిల్ దొరకడం కష్టమని న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోపణలు నిజమని తేలితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ నెల 19న శ్రీశైలం ఫారెస్ట్ చెక్ పోస్టులో జరిగిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. చెక్ పోస్టులో ఎమ్మెల్యే వాహనాన్ని ఆపిన అటవీ సిబ్బంది, ఆయనను వెంటనే కలవలేదన్న కారణంతో ఆగ్రహించిన బుడ్డా రాజశేఖరరెడ్డి, ఆయన అనుచరులు అక్కడి ఉద్యోగులపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వెంటనే స్పందించారు. ఉద్యోగులపై దాడి అంగీకారయోగ్యం కాదని ఖండిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను పిలిచి పూర్తి నివేదిక ఇవ్వమని ఆదేశించగా, పవన్ కళ్యాణ్ నేరుగా పోలీసులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇద్దరు కీలక నేతలు ఒకేసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆలస్యం చేయకుండా కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ప్రభుత్వం సంకేతం ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఈ సంఘటనతో టీడీపీ, జనసేన (Janasena) కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. నిజానికి బుడ్డా రాజశేఖరరెడ్డి గతంలో కూడా పలు వివాదాల్లో చిక్కుకున్నారు. గత జులైలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు (Supari Palanku Tholi Adugu) కార్యక్రమంలో ఆయన అనుచరులు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి (Erusu Prathap Reddy)పై దాడి చేయడం ,అదే సమయంలో నంద్యాల (Nandyal) ఎంపీ బైరెడ్డి శబరి (Byreddy Shabari) తో కూడా వివాదానికి దిగడం తెలిసిందే.అప్పట్లో అది పార్టీ అంతర్గత సమస్య అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వ సిబ్బందిపైనే దాడి జరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది.
ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించుకోవాలనుకుంటున్న సమయంలో ఇలాంటి సంఘటనలు తలనొప్పిగా మారాయి. అందుకే సీఎం, డిప్యూటీ సీఎం నేరుగా జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఆధారాలు సేకరించి, ఎమ్మెల్యే అరెస్టు కోసం సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్న దానిపై రాష్ట్ర రాజకీయ వర్గాలు కన్నేశారు.