Pawan Kalyan: పార్టీ విస్తరణ కోసం ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ కీలక వ్యూహం..
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉత్తరాంధ్ర (Uttarandhra)పై దృష్టి కేంద్రీకరించారు. గోదావరి జిల్లాల తరువాత జనసేనకు బలమైన స్థావరం ఈ ప్రాంతమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ సామాజిక సమీకరణలు కూడా పార్టీకి అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. మెగా అభిమానుల పుట్టినిల్లు కూడా ఉత్తరాంధ్ర కావడంతో, ఈ ప్రాంతం నుంచి పార్టీ మరింత బలంగా ఎదగాలని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆయన తన తొలి పెద్ద రాజకీయ యాక్షన్ ప్లాన్‌ను ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు.
టీడీపీ (TDP)తో కలసి ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో జనసేన (Jana Sena) తొలిసారి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత దాదాపు పదిహేనునెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలో ప్రభుత్వ వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్న పవన్, ఇప్పుడు మళ్లీ పార్టీ పనులపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఆ దిశగా ఈ నెల 30న విశాఖపట్నం (Visakhapatnam)లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీ కేడర్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం జనసేనకు ఈ ప్రాంతంలో ఆరు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు, విజయనగరం (Vizianagaram)లో ఒకటి, శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఒకటి. రానున్న రోజుల్లో ఈ బలం మరింత పెంచుకోవాలని పార్టీ భావిస్తోంది. అలాగే రెండవ, మూడవ శ్రేణి నాయకత్వాన్ని పెంపొందించి, వచ్చే సంవత్సరం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల జనసేనలో అసంతృప్తి స్వరాలు వినిపించాయి. ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) పర్యటన తర్వాత ఈ అంశం బహిర్గతమైంది. కొన్ని చోట్ల టీడీపీ ఆధిపత్యం కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని స్థానిక నేతలు స్పష్టంగా చెప్పారు. దీనిపై స్పందించిన నాగబాబు, సహనంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ స్వయంగా కార్యకర్తలతో నేరుగా మాట్లాడటం ద్వారా నిజమైన స్థితిగతులను అర్థం చేసుకోవాలని భావిస్తున్నారు.
క్యాడర్‌కి దిశానిర్దేశం చేసి, పార్టీని బలోపేతం చేయడం తన లక్ష్యమని పవన్ ఈ సమావేశంలో చెబుతారని తెలుస్తోంది. పొత్తులో ఎక్కువ స్థానాలు కోరుకోవాలంటే ముందుగా జనసేనకు స్వతంత్ర శక్తి ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పే అవకాశముంది. అలాగే స్థానిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇవ్వాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లో చురుకుగా ఉండాలని సూచించనున్నారని సమాచారం.
అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ కేడర్‌తో కలవడం వల్ల పార్టీ కార్యకర్తల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. అజెండా కూడా పూర్తిగా కేడర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సమావేశం తరువాత ఉత్తరాంధ్రలో జనసేన మరింత క్రమబద్ధమైన శక్తిగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.







