అమరావతిలో మ్యారియట్ హోటల్స్ ఎంట్రీ..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati)లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అమరావతిలోని లింగయ్యపాలెం గ్రామంలో సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘కోర్ట్‌యార్డ్ బై మ్యారియట్’ (Courtyard by Marriott) హోటల్ ప్రాజెక్ట్‌కు ఘనంగా భూమిపూజ నిర్వహించారు. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఫోర్ స్టార్ డీలక్స్ హోటల్‌ను నిర్మించనున్నారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో రెండు టవర్లుగా ఈ హోటల్‌ను నిర్మించనున్నారు. ప్రతి టవర్‌లో 10 అంతస్తులు ఉండనున్నాయి.
ఇవి కూడా చదవండి
మొత్తం 176 లగ్జరీ గదులు మరియు రెసిడెన్సీలు ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, బార్, మరియు ఆల్డే డైనింగ్ సౌకర్యాలు ఉండనున్నాయి. ఏకకాలంలో 2 వేల నుంచి 3 వేల మంది కూర్చునే సామర్థ్యంతో భారీ బ్యాంకెట్ హాల్‌ను కన్వెన్షన్లు మరియు ఈవెంట్స్ కోసం నిర్మిస్తున్నారు. మరో 6 నెలల్లో ఈ హోటల్ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. రెండున్నరేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేసి, 2029 నాటికి హోటల్ కార్యకలాపాలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరన్ గ్లోబ్ హోటల్స్ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రతినిధి కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి వేగవంతం కావడంతో అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లకు ఇక్కడ గొప్ప అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ వంటి పెద్ద సంస్థలు అమరావతికి వస్తుండటంతో పెట్టుబడులపై ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సింగిల్ విండో విధానం వల్ల అనుమతులు సులభంగా లభిస్తున్నాయని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోందని ఆయన కొనియాడారు. రాజధాని ప్రాంతంలో ఇటువంటి లగ్జరీ హోటళ్ల రాకతో అమరావతి ముఖచిత్రం గ్లోబల్ సిటీగా మారనుంది.
ఇవి కూడా చదవండి
