Killathuru Narayana Swamy: అంతా మా బాస్ చెప్పినట్లే చేశాను.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్టేట్మెంట్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఎస్సీ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడు కిళత్తూరు నారాయణ స్వామి (Killathuru Narayana Swamy) మళ్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో వార్తల్లోకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వం కాలంలో వెలుగులోకి వచ్చిన ఈ లిక్కర్ స్కాం (Liquor Scam) పై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కఠినంగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే 48 మందిపై కేసులు నమోదయ్యాయి. అందులో 13 మందిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఈ జాబితాలో అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అనుమానాల ఆధారంగా గత నెలలోనే ఆయనకు సిట్ అధికారులు నోటీసులు పంపించారు. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగా విచారణకు హాజరు కాలేకపోయారు. తాజాగా శుక్రవారం ఉదయం సిట్ బృందం నేరుగా ఆయన నివాసమైన చిత్తూరు (Chittoor) లోని ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో నారాయణ స్వామి ఎలాంటి ఆందోళన లేకుండా అధికారులను ఆత్మీయంగా ఆహ్వానించి, “రండి సార్, రండి” అంటూ స్వాగతించారు. బయట నుంచి టీ, కాఫీలు తెప్పించి వారికి విందు చేశారు. తన ఇంట్లోని పలు గదులు, బీరువాల తాళాలు స్వయంగా ఇచ్చి అధికారులు సులభంగా తనిఖీ చేయడానికి సహకరించారు.
అయితే అధికారులు అన్వేషించిన పత్రాలు ఈ తనిఖీలో దొరకలేదు. దీంతో మళ్లీ ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈసారి మాత్రం విచారణకు తప్పక హాజరవుతానని నారాయణ స్వామి హామీ ఇచ్చినట్లు సమాచారం.తనిఖీల సమయంలో ఆయన పలికిన కొన్ని మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. “నాకు చదువు తెలియదు. ఏ అక్షరం చదవలేను. నా బాస్ (Boss) నాకు పదవి ఇచ్చారు. ఆయన చెప్పింది నేను చేశాను. అది సక్రమమో అక్రమమో నాకు అర్థం కాలేదు. మీరు అధికారులు వచ్చారు కాబట్టి ఎలా సహకరిస్తున్నానో, అప్పట్లో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా నాయకుడు చెప్పినట్లు సహకరించాను. ఈసారి మీరు రమ్మంటే తప్పక వస్తాను” అని ఆయన పేర్కొన్నారని తెలిసింది.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఒకవైపు సిట్ దర్యాప్తు వేగంగా సాగుతుండగా, మరోవైపు నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు కొత్త కోణం తెరపైకి తెచ్చాయి. తాను చేసిన పనులన్నీ పార్టీ ఆదేశాల ప్రకారం మాత్రమే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు దర్యాప్తు అధికారులు తదుపరి విచారణలో ఏ విధమైన ఆధారాలు సేకరిస్తారో అన్నది ఆసక్తిగా మారింది.మాజీ మంత్రి పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పినప్పటికీ, కేసు ఎలా ముందుకు సాగుతుందన్నది చూడాలి.