Jagan: మారిన కాలానికి తగ్గట్టు అడుగులు వేయడంలో వెనుక పడుతున్న జగన్..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతోంది. ఈ మార్పులను అర్థం చేసుకుని ముందుకు సాగిన నాయకులే ఎక్కువ రోజులు నిలబడగలుగుతున్నారు. కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇప్పటికీ పాత విధానాలే సరిపోతాయని భావిస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. ఒకప్పుడు ప్రజలు ఏదైనా ఓపికగా భరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాలనలో మంచిదేమైనా ఉంటే అది కొనసాగాలని వారు కోరుకుంటున్నారు. చెడు జరుగుతోందని అనిపిస్తే వెంటనే వ్యతిరేకంగా నిలబడుతున్నారు.
గతంలో ప్రజలు ప్రభుత్వం మారినా పథకాలు నిలబడకపోవడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అ ధోరణి లేదని ఎన్నికలు నిరూపించాయి. మంచి పథకం తమకు మేలు చేస్తుందనిపిస్తే అది ఏ ప్రభుత్వమైన కొనసాగించాలని కోరుతున్నారు. ఈ సందర్భంలోనే వైఎస్ జగన్ చేసిన కొన్ని నిర్ణయాలు ఆయనకు మైనస్‌గా మారాయి. అన్నా క్యాంటీన్ (Anna Canteen) వంటి పథకాన్ని ఆపివేయడం, ప్రజాభవన్ (Prajabhavan) కూల్చివేయడం, అమరావతి (Amaravati) విషయంలో తీసుకున్న తీరూ ప్రజలలో వ్యతిరేకత రేకెత్తించాయి.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాజకీయ నేతలు తరచుగా చెబుతుంటారు. అది నిజమే. కానీ ప్రజల గమనాన్ని బట్టి అడుగులు వేయకపోతే నష్టం తప్పదనే విషయం తాజాగా స్పష్టమవుతోంది. జగన్ మాత్రం ఒకప్పుడు ఉన్న పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నాయనే భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ కాలం మారింది. ప్రజలు మారిపోయారు. ఇప్పుడు వారు పార్టీని కాదు, తమకు ఉపయోగపడే నిర్ణయాలనే చూడాలని నిర్ణయించుకున్నారు.
ఇక తాజాగా వచ్చిన ఆన్లైన్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ప్రజల్లో మెజారిటీ మంది జగన్ అసెంబ్లీ (Assembly)కి వెళ్లాలని కోరుతున్నారు. తమ తరఫున సభలో గళం వినిపించాలని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రజల మధ్యకు తరచూ రావాలని కూడా ఆశిస్తున్నారు. కానీ జగన్ ఈ రెండింటిలోనూ మొండి వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీకి హాజరుకాకుండా దూరంగా ఉండటం, ప్రజల మధ్యకి వచ్చినా అది పండుగ మాదిరిగానే ఉండటమే తప్ప అసలు సమస్యలను తెలుసుకోవడంలో చురుకుగా లేరన్న భావన పెరిగింది.
ఇలాంటి తీరుతో ఆయనకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల నాడిని అర్థం చేసుకుని, వారి అవసరాలకు తగ్గట్టు తన రాజకీయాలను మార్చుకోవాల్సిన అవసరం జగన్‌కు ఉంది. ఒకవేళ ఆయన ఇప్పటికైనా ఈ మార్పు తీసుకురాకపోతే, రాబోయే రోజుల్లో మరింత కష్టాల్లో పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







