Jagan: కాగ్ రిపోర్ట్ ఆధారంగా లెక్కలతో కూటమి పై జగన్ దాడి..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణంలో తాజాగా కాగ్ (CAG) రిపోర్టు హాట్ టాపిక్‌గా మారింది. ఈ రిపోర్టు వెలువడిన వెంటనే వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అప్పులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
జగన్ , తాము అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో చేసిన మొత్తం అప్పులు, కూటమి ప్రభుత్వం కేవలం పద్నాలుగు నెలల్లో చేసిన అప్పులతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయన్నారు. తాము చెప్పే లెక్కలు తాము అంచనా వేసినవి కాదు, కాగ్ నివేదికలో ఉన్న వాస్తవాలని మాత్రమే బయటపెడుతున్నానని స్పష్టం చేశారు.
ఆ రిపోర్టు ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి 12.04 శాతం ఉండగా, ఏపీ రాష్ట్ర ఆదాయ వృద్ధి మాత్రం కేవలం 3.08 శాతానికే పరిమితమైందని ఆయన అన్నారు. ఇదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ వృద్ధి రేటు కేవలం 2.39 శాతం మాత్రమే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఇది ఎందుకు జరిగిందో? ప్రజల కొనుగోలు శక్తి ఎందుకు పడిపోయిందో? అని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధికారంలోకి వచ్చినప్పుడు సంపద సృష్టిస్తానని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందని జగన్ పేర్కొన్నారు. సంపదను సృష్టించడం బదులు భారీ అప్పుల బారిన పడిన రాష్ట్రాన్ని కాగ్ రిపోర్టు స్పష్టంగా చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుల పరంగా చూసుకుంటే, తమ ప్రభుత్వం ఐదేళ్లలో మొత్తం రూ.3.32 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం కేవలం పద్నాలుగు నెలల్లోనే రూ.1.86 లక్షల కోట్ల రుణాలు తీసుకువచ్చిందని జగన్ లెక్కలు చూపించారు. ఇది ఎంత పెద్ద తేడా అనేది ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.
జగన్ చేసిన ఈ పోస్టు తర్వాత రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. ఆయన సూటిగా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ప్రశ్నలు విసిరారు. “ఇంత భారీగా అప్పులు చేసిన పరిస్థితిలో మీరు ప్రజలకు ఏ సమాధానం ఇస్తారు?” అనే కోణంలో ఆయన విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ లెక్కలపై వైసీపీ వర్గాలు ధీటుగా ప్రచారం మొదలుపెట్టాయి. తమ ప్రభుత్వాన్ని విమర్శించే కూటమి నేతలే ఇప్పుడు భారీ రుణాలతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు, కూటమి అనుకూలులు మాత్రం రాష్ట్ర అభివృద్ధికి రుణాలు అవసరమని వాదిస్తున్నారు. ఏది ఏమైనా, కాగ్ రిపోర్టును ఆధారంగా చేసుకుని జగన్ చేసిన ఈ విమర్శలు రాబోయే రోజుల్లో రాజకీయ వాదనలకు మరింత వేడి తెచ్చే అవకాశముంది.