Pensions: వికలాంగుల పెన్షన్ల వివాదం.. చంద్రబాబు సర్కార్కు తలనొప్పులు..!!
ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్లపై (handicapped pensions) రాజకీయ వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం (NTR Bharosa Pension Scheme) కింద వికలాంగులకు ప్రతినెలా పింఛను అందుతోంది. ఇటీవల వికలాంగుల పింఛన్లలో నకిలీలను ఏరివేసేందుకు ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. భారీగా అనర్హులను గుర్తించిన ప్రభుత్వం అలాంటి వాళ్లందరికీ వచ్చే నెల నుంచి పింఛను రద్దు చేస్తూ సందేశాలు పంపించింది. దీంతో వేలాది మంది దివ్యాంగులు ఆందోళనకు దిగారు. వైసీపీ వీళ్లకు మద్దతుగా నిలుస్తోంది. అయితే, తాము అనర్హుల పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నామని, అర్హులందరికీ పూర్తి సహాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేతలు, మత్స్యకారులు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులకు ప్రతి నెలా పింఛను అందిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 2024 జూలై నుంచి పింఛను మొత్తాన్ని కూటమి ప్రభుత్వం భారీగా పెంచింది. సాధారణ పింఛన్లను రూ.3వేల నుంచి రూ.4వేలు చేసింది. పాక్షిక వైకల్యం ఉన్న దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తి వైకల్యం ఉన్నవారికి రూ.15వేలు అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 66.34 లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. వీళ్లలో సుమారు 8 లక్షల మంది వికలాంగులున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పథకంలో అక్రమాలను తొలగించేందుకు వెరిఫికేషన్ ప్రారంభించింది. బోగస్ సర్టిఫికెట్లు, అర్హత లేకుండానే పెన్షన్లు పొందుతున్నట్టు తనిఖీల్లో బయటపడింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో దొంగ వికలాంగ సర్టిఫికెట్ల ద్వారా చాలా మంది లబ్ది పొందినట్లు గుర్తించింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక మెడికల్ టీమ్లు ఏర్పాటు చేసి లబ్దిదారులందరినీ పరీక్షించింది. ఆ మేరకు నకిలీలను తొలగించి అర్హులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది.
ఆగస్టు నాటికి పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 66.34 లక్షల నుంచి 62.19 లక్షలకు తగ్గినట్లు సమాచారం. దాదాపు 2లక్షల మంది వికలాలంగుల పెన్షన్లను సెప్టెంబర్ నుంచి రద్దు చేస్తున్నట్టు నోటీసులు అందజేశారు. ఇది ఆందోళనకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. వీళ్లకు వైసీపీ అండగా నిలుస్తోంది. రాజకీయ కారణాలతో అర్హులను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపిస్తోంది. వైకల్య శాతాన్ని తగ్గించడం ద్వారా భారీగా వికలాంగులను తొలగిస్తోందని విమర్శిస్తోంది. అయితే.. ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అర్హులకు పూర్తి పెన్షన్లు అందుతాయని, తనిఖీలు పారదర్శకంగా జరుగుతాయని చెబుతోంది.







