TDP – BJP: టీడీపీని బీజేపీ ఇంకా నమ్మట్లేదా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో (AP Politics) తెలుగుదేశం పార్టీ (TDP), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య సంబంధాలు ఎప్పుడూ సంక్లిష్టమైనవి. 2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి బలమైన సమన్వయంతో పనిచేస్తోందని భావిస్తున్నారు. అయినా ఇటీవలి ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వైఖరి కొన్ని సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఎన్నికలలో బీజేపీ నేతలు, వైసీపీ (YCP) మద్దతును కోరడం, టీడీపీ-బీజేపీ సంబంధాలలో నమ్మక లోపాన్ని సూచిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. 1996లో టీడీపీ జాతీయ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరినప్పటికీ, 2004, 2018లో రెండుసార్లు ఈ కూటమి నుండి బయటకు వచ్చింది. 2018లో టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై పరుష పదజాలం ఉపయోగించారు. అయినా, 2024 ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంతో టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరింది. ఈ కూటమి 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించింది. ఈ విజయం కూటమి బలాన్ని సూచిస్తోంది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసింది. కూటమిలో ఉన్నాయి కాబట్టి టీడీపీ, జనసేన పూర్తిగా అండగా నిలిచాయి. వాస్తవానికి ఎన్డీయే అభ్యర్థి విజయానికి సరిపడా మెజారిటీ ఉంది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేదు. అయినా బీజేపీ నేతలు వైసీపీని సంప్రదించి మద్దతు కోరడం ఆశ్చర్యం కలిగించింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ నిత్యం రాజకీయ యుద్ధం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వెళ్లి వైసీపీ మద్దతు కోరడం టీడీపీ-బీజేపీ మధ్య నమ్మక లోపాన్ని సూచిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు దారితీసింది.
ఏపీలో వైసీపీని విపక్షంగా చూడాలి. కానీ అధికారంలో ఉన్న బీజేపీ, వైసీపీతో అంటకాగడాన్ని టీడీపీ నేతలు సహించలేకపోతున్నారు. బీజేపీకి తాము సంపూర్ణ సహకారాలు అందిస్తున్నా, బీజేపీ మాత్రం ఇప్పటికీ వైసీపీకి అండగా నిలుస్తోందనే అనుమానాలు టీడీపీ నేతల్లో ఉన్నాయి. తాజాగా వైసీపీని బీజేపీ మద్దతు కోరడం, వైసీపీ కూడా అందుకు అంగీకరించడం.. టీడీపీ నేతల అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. వైసీపీతో బీజేపీ సఖ్యత టీడీపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయం. రాష్ట్రంలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ పార్టీ అంతు చూడాలనే లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోంది. ఇలాంటప్పుడు కేంద్రంలోని బీజేపీ, వైసీపీకి మద్దతు ఇవ్వడం టీడీపీ ముందరి కాళ్లకు బంధం వేయడం లాంటిదేనని చెప్పొచ్చు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ వైఖరి, టీడీపీ-బీజేపీ కూటమిలో అంతర్గత సమస్యలను బహిర్గతం చేసిందని చెప్పొచ్చు. బీజేపీ, వైసీపీ మద్దతు కోరడం, రాష్ట్ర రాజకీయాలను స్థానిక పార్టీలకు వదిలేసి, జాతీయ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఆలోచనను సూచిస్తుంది. టీడీపీకి ఇది ఒక హెచ్చరికగా పనిచేయవచ్చు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో స్వతంత్రంగా బలపడితే, టీడీపీ రాజకీయ ఆధిపత్యం ప్రమాదంలో పడవచ్చు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొత్త మలుపులకు దారితీయవచ్చు.







