Chandrababu: మోదీ సుపరిపాలన యాత్రలో కూటమి నేతలు పాల్గొనాలి : చంద్రబాబు
వాజ్ పేయీ (Vajpayee) హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశం దశ- దిశ మార్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గుర్తు చేశారు. మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాజ్ పేయీ స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్ మోదీ (Modi) సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ (BJP) కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ నెల 11 నుంచి 25 వరకు చేపట్టే అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో మూడు పార్టీల నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో సుపరిపాలనకు వాజ్పేయీ నాంది పలికారని, ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయని గుర్తు చేశారు. అజాత శత్రువు, ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని కొనియాడారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన స్వశక్తితో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందన్నారు. నాడు అణు పరీక్షలు అయినా, నేడు సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా నేడు సాగరమాల అయినా అవి ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047 నాటికి నంబర్ వన్ చేసేందుకు పని చేస్తున్నారన్నారు. యువతరానికి మోదీ స్ఫూర్తినిస్తున్నారన్నారు. వాజ్పేయీ శతజయంతి కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొనాలని చంద్రబాబు కోరారు.
-NS GOUD






