Yuvagalam: యువగళం.. నారా లోకేశ్ రాజకీయ పరిణతికి మూడేళ్లు
రాజకీయాల్లో వారసత్వం అడుగుజాడలు వేయడం సులభమే కానీ, సొంత ముద్ర వేయడం కత్తిమీద సామే. నారా లోకేశ్ విషయంలోనూ అదే జరిగింది. ఒకానొక సమయంలో సోషల్ మీడియా వేదికగా విపక్షాల ట్రోలింగ్‌కు, వ్యక్తిగత విమర్శలకు గురైన లోకేశ్.. వాటన్నింటికీ మౌనంగా ఉంటూనే, తన పాదయాత్ర ద్వారా బలమైన సమాధానం ఇచ్చారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన ‘యువగళం’ పాదయాత్ర నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన సాధించిన మార్పులు చర్చనీయాంశంగా మారాయి.
పాదయాత్ర ప్రారంభంలో లోకేశ్ నడకపై, మాట తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఎండను, వానను లెక్కచేయకుండా ప్రజల మధ్యకు వెళ్లడం ఆయనలో కొత్త మనిషిని ఆవిష్కరించింది. కిలోమీటర్లు పెరిగే కొద్దీ లోకేశ్‌లో ఓర్పు, సహనం పెరిగాయి. ప్రతిపక్షాలు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా, ఆయన తన సంయమనాన్ని కోల్పోలేదు. విమర్శలకు మాటలతో కాదు, చేతలతో సమాధానం చెప్పాలి అనే తత్వాన్ని ఆయన అలవర్చుకున్నారు. ఈ యాత్రలో ఆయన ప్రజల కష్టాలను నేరుగా వినడం, వారితో కలిసి భోజనం చేయడం, రచ్చబండ కార్యక్రమాల ద్వారా సామాన్యుడి బాధను అర్థం చేసుకోవడం ఆయనను ఒక ప్రజా నాయకుడిగా తీర్చిదిద్దింది.
యువగళం యాత్ర సాఫీగా సాగిపోలేదు. మధ్యలో తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో యాత్రకు ఆటంకం కలిగింది. ఆ క్లిష్ట సమయంలో లోకేశ్ ప్రదర్శించిన ధైర్యం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తూనే, పార్టీ శ్రేణులను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనుకోని అడ్డంకుల వల్ల యాత్ర అనుకున్న లక్ష్యం కంటే ముందే ముగిసినప్పటికీ, ఆ తక్కువ సమయంలోనే లోకేశ్ సాధించిన రాజకీయ పరిణతి అమోఘం.
యువగళం పాదయాత్రలో లోకేశ్ కేవలం నడవడమే కాదు, ప్రజల నుంచి వేల సంఖ్యలో వినతులు స్వీకరించారు. మడత పెట్టిన ప్రతి కాగితం వెనుక ఉన్న కన్నీటి గాధను ఆయన గుర్తు పెట్టుకున్నారు. నేడు అధికారంలోకి వచ్చాక, ముఖ్యంగా ఐటీ, విద్య శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో ఆనాడు నోట్ చేసుకున్న అంశాలే ప్రతిబింబిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతానని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ పాలన సాగిస్తున్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణలో ఆయన చూపిస్తున్న వేగం యువగళం నాటి వాగ్దానాల ఫలితమే. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రతిరోజూ సామాన్యులను కలిసి వారి సమస్యలను తీర్చడం అనేది పాదయాత్ర నేర్పిన క్రమశిక్షణే.
మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎదురైన ఓటమిని సవాలుగా తీసుకుని, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన లోకేశ్, 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపు కేవలం ఒక సీటు గెలుపు మాత్రమే కాదు, ఆయన నాయకత్వ లక్షణాలకు ప్రజలు ఇచ్చిన ఆమోద ముద్ర.
యువగళం పాదయాత్ర లోకేశ్‌ను ఒక ‘వారసత్వ రాజకీయ నాయకుడి’ స్థాయి నుంచి ‘ప్రజా నాయకుడి’ స్థాయికి చేర్చింది. నారా లోకేశ్ రాజకీయ ప్రస్థానాన్ని ‘యువగళం’కు ముందు, ‘యువగళం’కు తర్వాత అని విభజించవచ్చు. విమర్శల తుపానులను తట్టుకుని, తనలోని పరిణతిని చాటుకుంటూ లోకేశ్ సాగించిన ఈ 3,132 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర.. ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై లోకేశ్ ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగారు అనడంలో అతిశయోక్తి లేదు.






