Chandra Babu: మంత్రుల పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు.. పవన్ కు మినహాయింపు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నిర్ణయాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడూ పార్టీ నాయకులు, మంత్రుల పనితీరును గమనిస్తూ, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అన్నదానిపై రివ్యూ చేస్తుంటారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తన మంత్రుల పనితీరుపై మార్కులు వేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంత్రుల పనితీరుకు సంబంధించి ఫైళ్ల క్లియరెన్స్ వేగం ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకులు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.
ఈసారి ఇచ్చిన ర్యాంకులలో వ్యవహారాలను వేగంగా పూర్తి చేస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. రెండో స్థానంలో నారా లోకేష్ (Nara Lokesh) నిలవడం గమనార్హం. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ (Satya Kumar) మూడవ ర్యాంక్‌లో ఉన్నారు. హోమ్ మంత్రి అనిత (Anitha) నాలుగవ స్థానంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఐదవ స్థానంలో ఉన్నారు. అంటే టాప్ ఫైవ్ మంత్రులు తమ పనితీరుతో ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించారు.
అయితే చివరి వరుసలో ఉండే మంత్రులు కూడా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu), ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఆలస్యం చేస్తున్నారని భావించి తక్కువ ర్యాంకులు వచ్చాయి. మిగతా మంత్రులంతా మధ్యస్థానంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో వేగం పెంచాలంటే ముఖ్యంగా ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని స్పష్టం చేస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా గతసారి ఇచ్చిన ర్యాంకులలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు పదవ స్థానమే రావడం వివాదానికి దారి తీసింది. ఆ ర్యాంక్ కారణంగా జనసేన (Janasena) కార్యకర్తలలో అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా లోకేష్ ముందు వరుసలో ఉండటం, పవన్ వెనుకబడటం ఆ సమయంలో చర్చనీయాంశమైంది. దాంతో ఈసారి పవన్ కళ్యాణ్‌కి ర్యాంకుల వ్యవహారంలో మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గతంలో చంద్రబాబు నాయుడు తనకూ ర్యాంక్ ఇచ్చుకున్నారు. కానీ ఈసారి తనతో పాటు పవన్ కళ్యాణ్‌ను కూడా పక్కన పెట్టి మిగిలిన 23 మంది మంత్రులకు మాత్రమే ర్యాంకులు కేటాయించారు. అయితే ఇవి కేవలం ఫైళ్ల క్లియరెన్స్‌కి సంబంధించిన ప్రాథమిక ర్యాంకులేనని చెబుతున్నారు. నిజమైన పనితీరు అంచనా మాత్రం త్వరలో సెప్టెంబర్‌లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వెలువడనుంది.
అప్పుడు మంత్రులు గత పదిహేనునెలలుగా ఎలా పనిచేశారు, వారు ప్రజలతో ఎంతవరకు మమేకమయ్యారు, వారి శాఖల్లో ఎంత అభివృద్ధి జరిగిందన్న అంశాలన్నింటినీ కలిపి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తారని అంటున్నారు. ఆ నివేదిక ఆధారంగా తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఎవరు టాప్‌లో నిలుస్తారు, ఎవరు చివరగా ఉంటారన్నది అప్పుడే తేలనుంది.







