Pulivendula: పులివెందులలో చంద్రబాబు మార్క్ రాజకీయం..?
తెలుగుదేశం పార్టీ(TDP) పులివెందుల నియోజకవర్గం లో పాగా వేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. 2024 తర్వాత పులివెందుల విషయంలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) గట్టి ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు అప్పటి నాయకులతో తక్కువగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు, గత కొన్ని రోజులుగా ఎప్పటికప్పుడు వారితో సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. పార్టీ చేరికల విషయంలో కూడా పార్టీ అధిష్టానం దూకుడు ప్రదర్శిస్తుంది. ఇక పార్టీ నాయకత్వంలో కూడా స్వల్పంగా మార్పులు చేశారు చంద్రబాబు.
వైఎస్ కుటుంబానికి గతంలో కొంతమంది నాయకులు సహకరించి, పార్టీని బలోపేతం కాకుండా ప్రయత్నాలు చేశారనే విమర్శల నేపథ్యంలో, బీటెక్ రవి(Btech Ravi)కి కీలక బాధ్యతలు అప్పగించింది ఆ పార్టీ నాయకత్వం. ఇక అప్పటినుంచి బీటెక్ రవి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. జిల్లా పరిషత్తు స్థానాన్ని కూడా టిడిపి కైవసం చేసుకుని దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో త్వరలో బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీటెక్ రవి, నియోజకవర్గంలో కీలక మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయం కూడా మారబోతుందని సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి, పార్టీలోకి చేరాలి అనుకుంటున్న నాయకులను అధిష్టానం స్వాగతించాలభావిస్తున్నారు. చంద్రబాబు సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలకు ఆహ్వానం పలికేందుకు బీటెక్ రవి ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.
వైసీపీ అధిష్టానానికి భయపడుతూ కొంతమంది నాయకులు పార్టీలో చేరేందుకు ముందుకు రావటం లేదనే సమాచారాన్ని పార్టీ అధిష్టానానికి బీటెక్ రవి పంపించారు. ఇక అక్కడి నుంచి పార్టీలోకి ఎవరెవరు రావాలనుకుంటున్నారు, వారు ప్రస్తుతం వైసీపీలో ఏ ఏ పదవుల్లో ఉన్నారు, లేదంటే గతంలో వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే దానిపై పార్టీ అధిష్టానం అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి, పులివెందుల మున్సిపాలిటీతో పాటుగా మిగిలిన మండలాల్లో కీలక నాయకులను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానాన్ని గెలిచిన టిడిపి వచ్చే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీతో పాటుగా కడప పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.







