AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం కేసు… డీఫాల్ట్ బెయిల్‌పై ఆశ పెట్టుకున్న నిందితులు..!!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం (AP Liquor Case) కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటోంది. వై.ఎస్.జగన్ (YS Jagan) ప్రభుత్వ కాలంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా పాలసీలు మార్చి, లక్షల కోట్ల రూపాయల కమిషన్లును స్వీకరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారనే ఆరోపణలున్నాయి. ఈ కేసు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఏసీబీ కోర్టు (ACB Court) 12 మంది నిందితుల రిమాండ్‌ను పొడిగించింది. దీంతో కొంతమంది డీఫాల్ట్ బెయిల్ కోసం అప్లై చేసేందుకు సిద్ధమయ్యారు.
ఏపీ లిక్కర్ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులుగా ఉన్నారు. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజ్ (ఏ1) మాజీ సీఎం ఐటీ అడ్వైజర్ గా ఉన్నారు. ఆయనే ఈ వ్యవహారానికి మాస్టర్ మైండ్ అని సిట్ పేర్కొంది. రాజ్ కెసిరెడ్డి పాలసీ మార్పులు, ఓఎఫ్ఎస్ మానిప్యులేషన్లు చేశారని ఆరోపించింది. ఏ4గా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఈయన కమిషన్లను డైవర్ట్ చేశారని చెబుతున్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి (ఏ6), చాణక్య (ఏ8), ధనుంజయ రెడ్డి (ఏ31, రిటైర్డ్ ఐఎఎస్), కృష్ణ మోహన్ రెడ్డి (ఏ32, మాజీ ఓఎస్డీ), బాలాజీ గోవిందప్ప (ఏ33), దిలీప్ (ఏ30) తదితరులు ఇతర నిందితులు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వైసీపీ నేతలు కూడా ఆరోపణల్లో ఉన్నారు. ఛార్జ్‌షీట్‌లో జగన్ రెడ్డి కిక్‌బ్యాక్‌లు పొందారని పేర్కొన్నప్పటికీ, అతడిని నిందితుడిగా పేర్కొనలేదు.
ఏసీబీ కోర్టు ఇవాళ 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 9 వరకు పొడిగించింది. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు, 9 మందిని విజయవాడ జిల్లా జైలుకు, ఇద్దరిని గుంటూరు జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. జూలై 19న ప్రైమరీ ఛార్జ్‌షీట్, ఆగస్టు 11న అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లలో 21కి పైగా అభ్యంతరాలను కోర్టు లేవనెత్తింది. వీటిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అయితే.. 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కొంతమంది నిందితులు డీఫాల్ట్ బెయిల్ కోసం అప్లై చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఏ1 రాజ్ కేసిరెడ్డికి 126 రోజులు, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డికి 123 రోజులు, ఏ8 చాణక్యకు 125 రోజులు, ఏ30 దిలీప్‌కు 117 రోజులు, ఏ31 ధనుంజయ రెడ్డికి 102 రోజులు, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డికి 102 రోజులు, ఏ33 బాలాజీ గోవిందప్పకు 105 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పూర్తయింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, 90 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోతే డీఫాల్ట్ బెయిల్ హక్కు ఉంటుంది. అయితే, సిట్ ఇప్పటికే రెండు ఛార్జ్షీట్లు దాఖలు చేసినందున వీళ్ల బెయిల్ పిటిషన్లపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఒకవేళ కోర్టు ఆమోదిస్తే, నిందితులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు, ఆగస్టు 18న ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు కూడా మిథున్ రెడ్డి అంటిసిపేటరీ బెయిల్‌ను తిరస్కరించింది. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని తెలిపింది.







