ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిలిచ్చినందుకు జడ్జి సస్పెండ్
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిల్ ఇచ్చినందుకు జడ్జి సస్పెండ్ అయ్యారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన లఖ్‌నవూ కోర్టు జడ్జిని అలహాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఓ మహిళపై అత్యాచారం, ఆమె మైనర్ కూతురుపై అత్యాచార యత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 49ఏళ్ల ప్రజాపతికి ఇటీవల లఖ్‌నవూలోని పీఓసీఎస్ఓ కోర్టు ప్రత్యేక జడ్జి ఓంప్రకాశ్ మిశ్రా బెయిల్ మంజూరు చేశారు. దీనిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తి సదరు జడ్జిని సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించారు.
చాలా రోజులు తప్పించుకుని తిరిగిన ప్రజాపతిని మార్చి 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన దేశం విడిచి వెళ్లకుండా పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
