ఇదే స్ఫూర్తితో కలిసి పనిచేయండి
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి పివిఎన్ మాధవ్ గెలుపుకు చేసిన సమిష్టి కృషి ఫలించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలను అభినందించారు. మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపునిచ్చిన ఇదే విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. చంద్రబాబునాయుడు తన ఛాంబర్లో జిల్లా ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, అర్బన్ జిల్లా అధ్యక్షుడు, శానససభ్యులు వాసుపల్లి గణేష్‌కుమార్‌లను ఈ సందర్భంగా అభినందించారు. గత రెండు సార్లు వామపక్ష అభ్యర్థి ఎమ్మెల్సీగా మెలిగినప్పటికి అప్రభావాన్ని తుడిచేసిన ఘనత రెండు పార్టీలకే చెలిందన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రులను తెలుగుదేశం, భారతీయజనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి మాధవ్‌ను గెలిపించేలా వారి ఆలోచనల్లో కొత్త మార్పును రెండు పార్టీల పట్ల ఉన్న వారి సానుకూలతను ఓట్లుగా మలిచిన తీరు అభినందనీయంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ టిడిపి, బీజేపి మరిన్ని విజయాలను అందుకోవల్సి ఉందన్నారు. ఆ దిశగా కలిసి పనిచేయాలన్నారు.
