TDP: జూబ్లీహిల్స్ లో టీడీపీ మద్దతు ఎవరికి..?
జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో టీడీపీ (TDP) సానుభూతి పరుల ఓట్లకోసం పార్టీలన్నీ గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మద్దతు అడిగితే ఆ పార్టీకి సపోర్ట్ చేయాలని, లేకుంటే తటస్తంగా ఉండాలని టీడీపీ అధిష్టానం తెలంగాణ టీడీపీ (TTDP) నేతలకు స్పష్టం చేసింది. అయితే అధికారికంగా బీజేపీ ఎలాంటి మద్దతూ కోరలేదు. దీంతో టీటీడీపీ నేతలు కూడా బహిరంగంగా ఎవరికీ మద్దతు తెలియజేయలేదు.
అయితే కమ్మ (Kamma) సంఘాలతో సమావేశం నిర్వహించడం, ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్ పేట్ లో ప్రతిష్టిస్తామని కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రకటించడంతో ఆ పార్టీ వైపే టీడీపీ అభిమానులు మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డికి టీడీపీపై ఉన్న అభిమానం, చంద్రబాబుతో సత్సంబంధాలు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తాయని భావిస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ బరిలోకి దిగలేదు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా టీడీపీ తమ వెంటే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా భావిస్తోంది.
అయితే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) టీడీపీ నుంచే బీఆర్ఎస్ లోకి వచ్చారు. గత రెండు ఎన్నికల్లో టీడీపీతో పాటు కమ్మ సామాజిక వర్గం మాగంటి గోపినాథ్ వైపే నడిచింది. ఇప్పుడు కూడా కచ్చితంగా తమ వెంటే టీడీపీతో పాటు కమ్మ సామాజిక వర్గం ఉంటుందని బీఆర్ఎస్ (BRS) అంచనా వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్రులు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ హవా నడిచినా కూడా హైదరాబాద్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటింది.
ఇక బీజేపీ (BJP) కూడా టీడీపీ అభిమానుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఇక్కడ కూడా టీడీపీ అభిమానులు బీజేపీ వెంటే ఉంటారని నమ్ముతోంది. చంద్రబాబు స్వయంగా బీజేపీకి మద్దతు తెలపాలని చెప్పడంతో కచ్చితంగా తమవెంటే ఉంటారని ఆశిస్తోంది. అయితే బీజేపీ అధికారికంగా తమకు మద్దతు ఇవ్వాలని అడగకపోవడంతో టీటీడీపీ నేతలు కాస్త గుర్రుగా ఉన్నారు.
ఇలా మూడు పార్టీలూ టీడీపీ అభిమానుల ఓట్లపై గట్టిగానే హోప్ పెట్టుకున్నాయి. అయితే టీడీపీ అభిమానులు మాత్రం ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తి రేపుతోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీమాంధ్రులు, టీడీపీ వర్గాలు బీఆర్ఎస్ వెంట నడిచారు. అయితే బీఆర్ఎస్ ఓడిన తర్వాత సీన్ మారింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం, రేవంత్ రెడ్డికి టీడీపీతో సత్సంబంధాలు ఉండడం లాంటివి ఈసారి ఈక్వేషన్స్ మార్చే అవకాశం కనిపిస్తోంది.







