Nara Lokesh: సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ సన్నాహక చర్యలపై మంత్రి నారా లోకేష్
పార్టనర్ షిప్ సమ్మిట్ లో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు ఇప్పటికే సమాచారమిచ్చారు
డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ వల్లే రాష్ట్రానికి భారీ పరిశ్రమల రాక
విద్వేషాలు రెచ్చగొడుతున్న వైసీపీ… అన్నీ ప్రజల ముందు ఉంచుతున్నాం
నవంబర్ లో ప్రధాన పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
అమరావతి: విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్నాం. ఈ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడి చర్చలు జరుగుతాయి. పారిశ్రామికవేత్తలతో పాటు పాలసీ మేకర్లు హాజరై రాబోయే పదేళ్లలో పారిశ్రామికరంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అందులో భారత్, ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటి అనే అంశాలపై విస్తృతమైన చర్చలు జరుగుతాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ – 2025 సన్నాహక ఏర్పాట్లపై మంత్రి లోకేష్ ఉన్నతస్థాయి సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎక్సైజ్, గనులశాఖల మంత్రి కొల్లు రవీంద్ర, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ… పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, అశ్వనీ వైష్టవ్ లాంటి కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటివరకు 45దేశాల నుంచి 300మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. సమ్మిట్ లో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు. 48 స్పీకింగ్ సెషన్స్ లో సెక్టార్లవారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతాం. ఈసారి పార్టనర్ షిప్ సమ్మిట్ లో 410 ఎంవోయూలపై సంతకం చేయబోతున్నాం. వీటిద్వారా రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5లక్షల ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి.
యువగళంలోనే 20లక్షల ఉద్యోగాల హామీ
నేను యువగళం పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా 3,132 కి.మీ.లు నడిచాను. పాదయాత్ర సమయంలో జీడి నెల్లూరు నియోజకవర్గం శివారులో మోహన అనే తల్లిని కలిశాను. బోండాలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆమె భర్త మద్యానికి బలికాగా, కాయకష్టం చేసుకుని 30 ఏళ్లపాటు పిల్లలను పెంచి పెద్దచేసింది. తమ ఇద్దరి బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తే చాలని ఆ తల్లి చెప్పింది. హలో లోకేష్ కార్యక్రమంలో కూడా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పాను. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడే హామీ ఇచ్చా. ఆ హామీని నెరవేర్చేందుకు మంత్రులందరం మిషన్ మోడ్ లో పనిచేస్తున్నాం. కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులందరం కలసికట్టుగా పనిచేసి బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీలను తీసుకువచ్చాం. దీనివల్ల గత 16నెలల్లో రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తరలివచ్చాయి. సరైన ఎకోసిస్టమ్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని గుర్తించాం. తెలుగువారు ప్రపంచాన్ని శాసిస్తున్నా వారు స్థానికంగా పనిచేయకపోవడానికి అదే ప్రధాన కారణం. అందువల్లే పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టిపెట్టాం. ఫలితంగా గత 16నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.10లక్షల కోట్లు) ఏపీకి వచ్చాయి. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ద్వారా రూ.1.5లక్షల కోట్లు, దేశచరిత్రలో అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ $15 బిలియన్ డాలర్లు, నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ లక్ష కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1.25లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. డొమెస్టిక్ ఇన్వెస్టిమెంట్ లోనే కాకుండా ఎఫ్ డీఐలలో కూడా ఏపీ నెం.1గా నిలుస్తూ ముందుకు సాగుతోంది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల వల్లే పరిశ్రమల రాక
ఆంధ్రప్రదేశ్ లో అవలంభిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్లే కంపెనీలు తమ పెట్టుబడులకు ఏపీని ఎంచుకుంటున్నాయి. పక్కరాష్ట్రాలు కూడా పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నా ఏపీ వైపు మొగ్గుచూపడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలే కారణం. టీసీఎస్, ప్రీమియర్ ఎనర్జీ, రెన్యుపవర్ వంటి భారీ కంపెనీలు అందువల్లే క్యూకట్టాయి. ఏపీలో అద్భుతమైన సీ కోస్ట్ లైన్ ఉంది. గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గండికోట ఉంది. సమర్థవంతమైన టాలెంట్ పూల్, పోర్టు లాజిస్టిక్ లింకేజి ఉంది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం. పర్యాటక రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీకి భారీఎత్తున పెట్టుబడులు రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది అనుభవం కలిగిన సమర్థ నాయకత్వం గల ఏకైక రాష్ట్రం. చంద్రబాబు గారి లాంటి అనుభవం కలిగిన నేత మరే రాష్ట్రంలో లేరు. ఆయనకు నిరూపితమైన ట్రాక్ రికార్డు ఉంది. 1995లో ఆయన సీఎం అయిన దగ్గరనుండి ఎన్నో అద్భుతాలు సృష్టించారు.
ఐఎస్ బీ, సత్యం, కియా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఆయన నేతృత్వంలోనే వచ్చాయి. చంద్రబాబు గారి విజనరీ లీడర్ షిప్ వల్లే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైంది. గతంలో శంషాబాద్ కు 5వేల ఎకరాలు ఎందుకు అని ఎగతాళి చేశారు. ఈరోజు తెలంగాణా ఆదాయంలో 12శాతం ఆదాయం ఎయిర్ పోర్టు వల్లే వస్తోంది. అటువంటి విజనరీ లీడర్ షిప్ ఈరోజు ఏపీకే సొంతం. 2వది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు మనకు మాత్రమే ఉంది. కేంద్రంలో ప్రధాని మోడీజీ, రాష్ట్రంలో చంద్రబాబుగారి నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. వారి సమన్వయం వల్లే గూగుల్ లాంటి భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. మోడీ గారితోపాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ సహకరించారు. ఎన్ఎండీసీ స్లరీ పైప్ లైన్ కు కేంద్రం అనుమతించడంతో ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రాష్ట్రంలో లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3వది రాష్ట్రంలో అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు. దీనివల్లే పెద్దఎత్తున పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి.
అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి వికేంద్రీకరణ. క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపై దృష్టిసారించాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే మా ధ్యేయం. అందుకు అనుగుణంగానే అనంతపురం, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, ప్రకాశం జిల్లాలో సీబీజీ, నెల్లూరులో డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్, అమరావతిలో క్యాంటమ్ కంప్యూటింగ్, ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, రిఫైనరీ, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైస్, స్టీల్ సిటీ, డేటా సిటీలు ఏర్పాటవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగా ఆయా ప్రాంతాల్లో ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, సిఫీ సంస్థ 500 మెగావాట్ల డాటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. మా టార్గెట్ రాష్ట్రంలో 6 గిగావాట్ల డాటా సెంటర్లు ఏర్పాటు చేయడం. అందుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ, ఎకో సిస్టమ్ తీసుకురావాల్సి ఉంది. వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ కు ప్రాధాన్యత నిస్తున్నాం. ఆస్ట్రేలియాకి వెళ్లివచ్చాక నాలుగు విదేశీ వర్సిటీలతో చర్చలు జరుపుతున్నాం.
ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా పరిశోధనలకు జేమ్స్ కుక్ యూనివర్సిటీతో, స్పోర్ట్స్ అభివృద్ధికి గ్రిఫిత్ వర్సిటీతో చర్చలు జరుపుతున్నాం. సోలార్ సెల్, క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి కూడా ఇతర వర్సిటీలతో మాట్లాడుతున్నాం. ఈసారి మరింత వేగంగా అభివృద్ధి వికేంద్రీకరణ మా లక్ష్యం. పార్టనర్ షిప్ సమ్మిట్ లో 2.7లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5లక్షల ఉద్యోగాలు కల్పించే సంస్థలకు భూమిపూజ చేయబోతున్నాం. ఈ సమ్మిట్ కేవలం ఒప్పందాల కోసమే కాదు…ఏపీ యువత ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం. ప్రముఖమైన అన్ని సెక్టార్లలో లీడర్ షిప్ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ డేటా సంస్థలు ఏపీకి వస్తున్నాయి, స్టీల్, అల్యూమినియం, ఏఐ, ఆగ్రిటెక్, డ్రోన్ తదితర అన్నిరంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలన్నదే మా ధ్యేయం. విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమాన్ని మేం త్రీవే పార్టనర్ షిప్ గా భావిస్తున్నాం. ప్రభుత్వం, ప్రజలు, పారిశ్రామిక సంస్థలు కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఆంధ్రప్రదేశ్ అగ్రపథాన పయనిస్తుంది. నిన్న కూడా ముంబయిలో అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిశాను. ఇప్పుడు ప్రతిఒక్కరూ ఏపీ వైపు చూస్తున్నారు. అయినా మేం సంతృప్తి చెందడం లేదు. అన్నిరంగాల్లో ఏపీని నెం.1 చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
విద్వేషాలు రెచ్చగొడుతున్న వైసీపీ
విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇప్పటివరకు 1.8లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభించబోతున్నాం. సప్లయ్-డిమాండ్ ఆధారంగా ఏఐ ద్వారా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. మంత్రులంతా ఎకో సిస్టమ్ పై దృష్టిపెట్టాం, మా అందరి లక్ష్యం ఒక్కటే…20 లక్షల ఉద్యోగాల సాధన. అందరం ఫీల్డ్ కు వెళ్తున్నాం, నవంబర్ లో చాలా కంపెనీల ఫౌండేషన్ స్టోన్స్, రిబ్బన్ కటింగ్స్ ఉంటాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే వస్తున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ సంస్థ 14నెలల్లో, గూగుల్ 13నెలల్లో, ప్రీమియర్ ఎనర్జీ 45రోజుల్లో రాష్ట్రానికి రప్పించాం. జీసీసీ క్వాలిటీ ఆఫీస్ స్పేసేస్ విశాఖకు వస్తున్నాయి. పార్టనర్ షిప్ సమ్మిట్ లో ప్రభుత్వం, పెట్టుబడిదారులు, ప్రజలు కలిసి వస్తేనే అనుకున్నది సాధించగలం. కులం, మతం, ప్రాంతం ముసుగులో కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. గూగుల్ ఎనౌన్స్ తర్వాత వైసీపీ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారు. గూగుల్ వల్ల చెట్లు పెరగవని అన్నారు. తర్వాత వారి నాయకుడు నేనే తెచ్చాను అన్నారు. అటువంటి వారి చర్యలపై ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజలు అన్ని చూస్తున్నారు, వారికి అన్నీ తెలుసు. ఎవరేం చేస్తున్నారో అనుక్షణం మొత్తం ప్రజల ముందు ఉంచుతున్నాం. శ్రీకాకుళం ఇన్సిడెంట్ లో ఫేక్ వీడియో వదిలారు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్లు కూడా తెలిసిన కంపెనీలకు చెప్పి రాష్ట్రానికి రప్పిస్తే క్రెడిట్ వారికి ఇస్తా. రాష్ట్రం కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం… అభివృద్ధి చేసుకుందాం… ముందుకు తీసుకెళ్లదాం. ఇతర రాష్ట్రాల్లో అంతర్గతంగా కొట్టుకుంటారు. బార్డర్ దాటితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అలా లేదు. కలిసికట్టుగా వెళితేనే అనుకున్నది సాధించగలుగుతాం. వివిధ కారణాల వల్ల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు వాటిపై కూడా దృష్టిసారించాం. ఎడ్యుకేషన్ మంత్రిగా ఇండస్ట్రీ టై అప్ చేసి వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
పరిశ్రమలకు అనుగుణంగా కరిక్యులమ్
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ బలోపేతం చేస్తున్నాం. టూవీలర్ మెకానిక్ నుంచి క్వాంటమ్ ఇంజనీర్ వరకు ఏఐ సాంకేతికతతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఏఐ బేస్డ్ ప్లాట్ ఫాం ఏర్పాటుచేస్తున్నాం. అన్నీ అందులో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో గూగుల్, 2028నాటికి ఆర్సెలర్ మిట్టల్, 2026 నాటికి ప్రీమియర్ ఎనర్జీ, ఏఎన్ఎస్ఆర్, ఇతర జీసీసీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ప్రభుత్వాలు కొనసాగిన చోట రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. అందుకు తెలంగాణా, ఒడిశా రాష్ట్రాలు ఉదాహరణ. ప్రజలు కూడా ఆలోచించాలి. ఓవర్ నైట్ అద్భుతాలు జరగవు. ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉన్నపుడు అరాచకపాలన చూశాం. ప్రతిపక్ష ఆఫీసులపై దాడులు, హత్యలు అందరం చూశాం. గతంలో మొదటి పేజిలో ఏరోజు చూసినా అవే వార్తలు వచ్చేవి. ఈరోజు పెట్టుబడులు వంటి పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్లు బాగుచేశాం, ఇటీవల వర్షాలతో కొన్ని రోడ్లు పోయాయి. ఉభయగోదావరి జిల్లాలో వైట్ టాపింగ్ తో పర్మినెంట్ రోడ్లు వేస్తున్నాం. చంద్రబాబునాయుడు అంటే ఒక నమ్మకం, ఒక బ్రాండ్… స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలే పెట్టుబడులకు ఉపకరిస్తున్నాయి. ప్రజలు ప్రతిపక్షానికి 11సీట్లు ఇవ్వడంతో ప్రజల మనోభావాలు పెట్టుబడిదారులకు అర్థమయ్యాయి. మాకు అన్ని జిల్లాలు సమానం. విశాఖపట్నం ఎకనమిక్ కారిడార్ ఉత్తరాంధ్ర అంతటినీ కవర్ చేస్తుంది. అనంతపురంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుచేశాం.
క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపైనే మా దృష్టి
మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైన, ముఖ్యంగా క్లస్టర్ బేస్డ్ అభివృద్ధిపై దృష్టిపెట్టాం. ప్రతి క్లస్టర్ మాకు ముఖ్యమైనదే. సౌత్ ఆసియా ఫస్ట్ 158 క్యూబిక్ బిట్ కంప్యూటర్ జనవరిలో అమరావతి రాబోతోంది. తొలుత తాత్కాలికంగా విట్ లో ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా విద్య, వైద్యరంగాల్లో చాలా మార్పులు వస్తాయి. పారిశ్రామిక ప్రగతిపై మాకు క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. విజనరీ లీడర్ చంద్రబాబుగారు 20 ఏళ్ల ముందుగా ఆలోచిస్తారు. ప్రజలు ప్రతిపక్షానికి 11 సీట్లు ఇవ్వడంతో ఇన్వెస్టర్లకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అరాచక పాలనవల్లే వారికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అడ్డగోలుగా మాట్లాడటం వల్లే ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు. పీపీఏలు రద్దుచేయడం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. 10వేల కోట్ల అప్పు మనపై పడుతోంది. ఆ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకావడం లేదు. పీపీఏలు రద్దుచేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. దీనివల్ల ఏపీ యువకులు, ప్రజలు నష్టపోయారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సమీక్ష చేస్తున్నాం. మంచి నిర్ణయాలను కొనసాగిస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి రద్దుచేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని మేం అడగడం వల్లే కేంద్రం రూ.13వేల కోట్ల రాయితీలు ఇచ్చింది. అయితే స్టీల్ ప్లాంట్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంది. ఏపీ గవర్నమెంట్ కూడా స్టీల్ ప్లాంట్ లో షేర్ హోల్డర్ అన్న విషయాన్ని మంత్రి లోకేష్ గుర్తుచేశారు.







