Tiruvuru: రేపు క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు పంచాయితీ!
20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తిరువూరు (Tiruvuru) నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన ఆనందం ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. పార్టీ విజయం సాధించిన అతి తక్కువ కాలంలోనే, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (kolikapudi Srinivas), విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni) మధ్య తలెత్తిన తీవ్ర ఆధిపత్య పోరు పెద్ద సమస్యగా మారింది. ఈ విభేదాలు టీడీపీకి అతిపెద్ద తలనొప్పిగా పరిణమించింది. ఈ ఇద్దరు కీలక నాయకులు వ్యక్తిగత వైరాన్ని పక్కనబెట్టకుండా, నియోజకవర్గ వ్యవహారాలపై బహిరంగ వేదికలపైనా, సోషల్ మీడియాలోనూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వీళ్లద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామాలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే కాకుండా, స్థానిక కేడర్‌ను పూర్తిగా గందరగోళంలోకి నెట్టేశాయి. ఒకవైపు విజయోత్సాహంతో పాలనపై దృష్టి సారించాల్సిన సమయంలో, ఈ ఇద్దరు నేతల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఎవరి పక్షాన ఉండాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుండటంతో, టీడీపీ హైకమాండ్ ఎట్టకేలకు సీరియస్ నిర్ణయానికి ఉపక్రమించింది. ఈ క్రమంలోనే, టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని ఇరువురు నాయకులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రేపు విడివిడిగా వీళ్లిద్దరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు. ఇద్దరి నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం తమ నిర్ణయాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ అధినేత చంద్రబాబుకు అందించనుంది.
విభేదాలకు మూలకారణంగా భావిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై నియోజకవర్గంలోని ఇతర ముఖ్య నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉందని సమాచారం. కొలికపూడికి తన శైలి మార్చుకోవాలని గతంలోనూ హైకమాండ్ నుంచి పలుమార్లు హెచ్చరికలు అందాయి. ఆయన పంథా మారకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగివచ్చేలోపు క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సిద్ధం చేయాలని ఆదేశాలు అందాయి.
పార్టీ వ్యతిరేక చర్యలను, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏమాత్రం సహించేది లేదంటూ చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా కొలికపూడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయం సాధించిన కీలక నియోజకవర్గంలో ఇలాంటి విబేధాలు సహిస్తే భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నేతలు కూడా అదే పంథా అనుసరించే ప్రమాదం ఉందని హైకమాండ్ భావిస్తోంది. తిరువూరు సమస్యను అల్టిమేటంగా పరిగణించి, ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది.







