Justice NV Ramana: జస్టిస్ ఎన్.వి.రమణ సంచలన వ్యాఖ్యల వెనుక కారణాలేంటి?
సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్.వి.రమణ (Justice N V Ramana) చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, న్యాయ వర్గాలలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నేతృత్వంలోని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు పెట్టి వేధించిందని ఆయన బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రమణపై నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం, అలాగే అమరావతి (Amaravati) రాజధాని విషయంలో చోటుచేసుకున్న రాజకీయ-న్యాయపరమైన పరిణామాలను మరోసారి తెరపైకి తెచ్చింది.
శనివారం ఒక ప్రైవేట్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న జస్టిస్ ఎన్.వి.రమణ, తన కుటుంబంపై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని ప్రస్తావించారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు పెట్టారనిత, తనపై ఒత్తిడి తీసుకురావడానికే అలా చేశారని ఆయన చెప్పారు. రాజధాని అమరావతి కోసం పోరాడిన రైతుల పక్షాన మాట్లాడిన వారందరినీ అప్పటి ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులు బదిలీలు, ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొన్నారని, వారి కుటుంబాలను రాజకీయ కుట్రలకు బలి చేశారని తీవ్రంగా విమర్శించారు. అప్పట్లో అమరావతికి అనుకూలంగా తీర్పులిచ్చిన పలువురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇటీవలే వాళ్లు మళ్లీ అమరావతి హైకోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ బదిలీల వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అర్థమవుతోంది.
2019 తర్వాత ముఖ్యంగా రాజధాని అమరావతికి, మూడు రాజధానుల ప్రతిపాదనకు మధ్య అనేక రాజకీయ, న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. అమరావతి రాజధాని నిర్మాణ సమయంలో జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసింది. అయితే అవి అక్రమంగా కొనుగోలు చేశారంటూ అప్పటి జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. జస్టిస్ రమణపై ఒత్తిడి తీసుకురావడానికి, ఆయన సీజేఐ కాకుండా అడ్డుకోవడానికి, ఆయన కుటుంబ సభ్యులపై భూముల అక్రమ కొనుగోళ్ల ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెట్టారని జస్టిస్ రమణ తాజా వ్యాఖ్యల ద్వారా ధృవీకరించారు. ఈ కేసులను న్యాయవ్యవస్థపై రాజకీయ కుట్రగా భావించారు.
అన్నిటికీ మించి, 2020 అక్టోబర్లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేకు నేరుగా ఒక లేఖ రాశారు. జస్టిస్ ఎన్.వి. రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, కోర్టు తీర్పులను ప్రభావితం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ సీజేఐకి లేఖ రాయడం న్యాయ చరిత్రలో అరుదైన సంఘటన అని చెప్పొచ్చు. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దాడిగా దీన్ని భావించారు. జగన్ లేఖపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపింది. చివరకు జస్టిస్ రమణకు క్లీన్ చిట్ లభించింది.
జస్టిస్ ఎన్.వి. రమణ చేసిన తాజా ఆరోపణలు, దేశంలో రాజకీయ వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధాన్ని మరోసారి స్పష్టం చేశాయి. న్యాయమూర్తులపైన, వారి కుటుంబ సభ్యులపైన క్రిమినల్ కేసులు పెట్టడం, బదిలీలు చేయించడం వంటి చర్యలు.. చట్ట ఉల్లంఘానే పరిగణించాలి. పాలనలో ప్రతీకారానికి అధికార వ్యవస్థను ఉపయోగించకూడదనే సూత్రాన్ని పాలకులు ఉల్లంఘించినట్లేనని విమర్శకులు అంటున్నారు. జస్టిస్ రమణ వంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సైతం ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నారని చెప్పడం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, న్యాయమూర్తుల ధైర్యంపై రాజకీయ ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియజేస్తుంది.
ఈ వివాదం ప్రధానంగా అమరావతి రాజధాని అంశంలోనే మొదలైంది. అమరావతి రైతుల పోరాటాన్ని, న్యాయవ్యవస్థపై వారు ఉంచిన నమ్మకాన్ని జస్టిస్ రమణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జస్టిస్ రమణ పదవీ విరమణ తర్వాత ఈ సంఘటనను బహిరంగంగా చెప్పడం, అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజకీయ ప్రత్యర్థులతో పోరాడటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఈ వ్యాఖ్యలు బలోపేతం చేశాయి.






