AP Ministers: పెట్టుబడుల వేటలో బిజీగా ఏపీ మంత్రులు.. ప్రపంచం దృష్టి ఆకర్షిస్తున్న పర్యటనలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్టుబడుల వేటలో ముందంజలో ఉంది. ఈ స్థాయిలో కసితో కృషి చేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేనట్టే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మంత్రులంతా విదేశీ పర్యటనలు చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తహతహలాడుతున్నారు.
ఇటీవల ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆస్ట్రేలియా పర్యటనలో పాల్గొని, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం “హంగ్రీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్” అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య ఒక్కటే రాష్ట్రం ఎంత దూకుడుగా ముందుకు వెళ్తుందో చెప్పడానికి సరిపోతుంది. ప్రభుత్వం లక్ష్యం సుస్పష్టంగా ఉంది — ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల కేంద్రంగా మార్చడం.
ఇక గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ (P. Narayana) ఇటీవల పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అరబ్ దేశాల్లో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన శోభా గ్రూప్ (Shobha Group) డైరెక్టర్ జ్యోత్స్న హెగ్డే (Jyotsna Hegde), యాస్టర్ గ్రూప్(Aster Group) ప్రతినిధులు, అలాగే కెఈఎఫ్ హోల్డింగ్స్(KEF Holdings) చైర్మన్ ఫైజల్ (Faizal) , బుర్జీల్ హోల్డింగ్స్ (Burjeel Holdings) అధికారులతో చర్చలు జరపనున్నారు. దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ సతీష్ శివన్ (Satish Sivan) తో కూడ ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశాల ఉద్దేశం ఏపీలోని పారిశ్రామిక అవకాశాలను వివరించి, పెట్టుబడులను ఆకర్షించడం.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన లండన్‌లో నాలుగు రోజుల టూర్లో భాగంగా పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చడమే ఆయన ప్రధాన లక్ష్యం. విశాఖపట్నం (Visakhapatnam) లో జరగబోయే భాగస్వామ్య సదస్సులో టూరిజం రంగానికి సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ (T.G. Bharat) కూడా పెట్టుబడుల కోసం పలు దేశాల్లో వ్యాపారవేత్తలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించేందుకు ఆయన కృషి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటన ముగించుకుని ఇప్పుడు లండన్‌లో ఉన్నారు. ఆయన ఈ పర్యటనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలసి, నవంబర్ 14,15 తేదీల్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు స్వయంగా ఆహ్వానిస్తున్నారు. మరోవైపు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరో విడత విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.మొత్తం మీద చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల వేటలో అద్భుతమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. విశాఖ సదస్సు డావోస్(Davos) స్థాయి కాన్ఫరెన్స్‌లకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సు తర్వాత ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.






