విజయ్ కి లైన్ క్లియర్.. శనివారం ప్రమాణ స్వీకారం
తమిళనాడులో రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెర పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే చీఫ్ విజయ్ కి గవర్నర్ పచ్చజెండా ఊపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ.. మేజిక్ ఫిగర్ కుదరకపోవడంతో గవర్నర్ రెండు సార్లు వెనక్కి పంపారు. కానీ.. శుక్రవారం సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించడంతో మెజారిటీ మార్కును చేరుకుంది. దీంతో విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్లి కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరుతూ మద్దతు లేఖలను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అంగీకరించడంతో శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని సిద్ధం చేశారు. ఇక పెద్ద ఎత్తున అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు రానున్నారు. దీంతో పోలీసులు బందోబస్తును చేస్తున్నారు. గవర్నర్ ను కలిసిన తర్వాత విజయ్ వామపక్ష కార్యాలయాలకు వెళ్లి, నేతలతో భేటీ అయ్యారు. విజయ్ ను వారు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మరో వైపు టీవీకేకు తాము బయట నుంచే మద్దతిస్తామని ప్రభుత్వంలో చేరమని వామపక్షాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని సీపీఎం నేత వాసుకీ తెలిపారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు సమావేశమయ్యాయని, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. అసెంబ్లీలో బల పరీక్ష సమయంలో మాత్రం విజయ్ కే మద్దతిస్తామన్నారు. అయితే ఇది కేవలం బయటి నుంచి మద్దతే అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
