బెంగాల్ గడ్డపై బీజేపీ.. సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం
బెంగాల్ గడ్డపై మొదటి సారిగా బీజేపీ సర్కార్ కొలువుదీరింది.రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కలకత్తాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి సుబేందు అధికారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులు చంద్రబాబు, యోగి, రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీ తదితరులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా సువేందు అత్యంత సాదాసీదాగానే కనిపించారు. కాషాయ రంగు కుర్తా మాత్రమే ధరించి కనిపించారు. ఆయనతో పాటు మంత్రులుగా అగ్నిమిత్ర పాల్, నిసిత్ ప్రామాణిక్, దిలీప్ ఘోష్, శంకర్ ఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బీజేపీ 207 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 80 సీట్లకే పరిమితం అయింది. సువేందు అధికారి రెండు చోట్ల పోటీ చేశారు. నందిగ్రామ్, భవానీపూర్ నుంచి ఆయన బరిలో నిలిచారు. భవానీపూర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావటం విశేషం. సువేందు భవానీపూర్‌లో మమతాపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు.
