ఇండియన్ ఆర్మీ చేతికి స్వదేశీ డ్రోన్ కాముకాజి.. ! శత్రుదేశాలకు టెన్షనే టెన్షన్..!
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ రక్షణపరంగా అప్రమత్తమైంది. సంప్రదాయ యుద్ధరీతుల నుంచి అధునాతన యుద్ధ తంత్రాల దిశగా అడుగులేస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పటి ఆధునిక యుద్ధ తంత్రాలైన ఏఐ, డ్రోన్లు సహా కీలక ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా స్వదేశీ డ్రోన్ కాముకాజిని.. ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదికి చేర్చింది.
ఆధునిక సాంకేతిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే ఆత్మాహుతి డ్రోన్లు (కాముకాజి) ఆర్మీ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రకానికి చెందిన వందలాది డ్రోన్లను స్వదేశీ సంస్థ తాజాగా సైన్యానికి (Indian Army) అప్పగించినట్లు సమాచారం. రూ.10 కోట్ల ఒప్పందంలో భాగంగా వీటిని అందజేసినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
గతేడాది పహల్గాం ఘటన నేపథ్యంలో.. సరిహద్దుల రక్షణ విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ప్రాణనష్టం జరగకుండా.. శత్రు మూకల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్లను (Suicide Drones) సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో కేంద్ర రక్షణశాఖ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులోభాగంగానే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ‘ఇన్సైడ్ ఎఫ్‌పీవీ’ అనే సంస్థ వందలాది ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ నార్తర్న్ కమాండ్‌కు డెలివరీ చేసినట్లు సమాచారం. అయితే, భద్రతా కారణాల రీత్యా ఎన్ని డ్రోన్లను అప్పగించారన్న దానిపై కచ్చితమైన సమాచారం బయటకు రాలేదు. కేవలం రెండు నెలల్లోనే ఈ డ్రోన్లను డెలివరీ చేయడం విశేషం. అత్యవసర కొనుగోలు కింద సైన్యం వీటిని తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాముకాజి డ్రోన్ల ప్రత్యేకతలు..?
ఇవి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఏఐ ఆధారిత గైడెన్స్‌తో కచ్చితమైన దాడులతో లక్ష్యాలను ఛేదిస్తాయి.గరిష్ఠంగా 2.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలవు. 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడులు చేస్తాయి. 2.5 కిలోల వరకు పేలుడు పదార్థాలను ఈ డ్రోన్లు మోసుకెళ్లగలవు.
అత్యవసర ముప్పులను వేగంగా ఎదుర్కొనే సామర్థ్యం వీటి సొంతం. శత్రు భూభాగాల్లోకి చొచ్చుకెళ్లి లక్ష్యాలను ఛేదిస్తాయి.సాధారణ దళాలు వెళ్లలేని ప్రాంతాల్లోకి వెళ్లి దాడులు చేయగలవు. జీపీఎస్ అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ ఉపయోగించేలా వీటిని రూపొందించారు.కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఈ డ్రోన్లు పనిచేయగలవు.
ఇవి కూడా చదవండి
