సీఎంగా తొలి సంతకం ఫ్రీ కరెంటు పైనే…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే ఫైలుపైనే తొలి సంతకం చేశారు. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం దానిపై కూడా సంతకం చేశారు. ఈ సందర్భంగా కీలక ఉపన్యాసం చేశారు.
‘‘తమిళనాడులో ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వచ్చింది. లౌకిక, సామాజిక, న్యాయ దశ మొదలైంది. డైరెక్టర్ కుమారుడు నేడు సీఎం అయ్యాడు. నేను మీ అందరివాడ్ని. మీ మామను. మీకు మేలే చేస్తాను. నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి. డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసేసింది.’’ అని అన్నారు.
అలాగే ‘నేను మీ కుటుంబ సభ్యుడి లాంటి వాడిని. సినిమాల్లో నన్ను ఉన్నతస్థాయిలో నిలిపారు. తమ్ముడూ రా.. అంటూ పిలిచారు కాబట్టే రాజకీయాల్లోకి వచ్చాను. నా ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఇది మీ ప్రభుత్వం.. డ్రగ్స్‌పై ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభం’ అని సీఎం విజయ్ అన్నారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తామని.. అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ‘దిస్ ఈజ్ న్యూ బిగినింగ్. ప్రజా ధనాన్ని వృథా చేయను.. దోచుకోను. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉంది.. అది విజయ్ మాత్రమే. నేను పవర్ సెంటర్.. మరో పవర్ సెంటర్ ఉండదు.. ఉండబోదు. మైనారిటీ ప్రజలకు, విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటా. కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది. వారికి రుణపడి ఉంటా. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.’’ అని విజయ్ పేర్కొన్నారు.
