పంచెకట్టు కాకుండా.. విజయ్ ‘‘కొత్త గెటప్’’… ఎందుకంటే?
తమిళనాడు అంటేనే పంచెకట్టు. వారి సంప్రదాయం అదీ. ఎవ్వరైనా పంచె కట్టులోనే కనిపిస్తుంటారు. అలాగే రాజకీయ నేతలంటే సహజంగా కుర్తా, పైజమా ధరించి వస్తుంటారు. కానీ.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ మాత్రం ఈ సంప్రదాయాన్ని తెంచేశారు. తమిళనాడు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో కనిపించారు. తమిళనాడు సంప్రదాయమైన ధోవతి కాకుండా, తెల్ల షర్టు, నలుపు ప్యాంట్, కోటు ధరించి ప్రమాణ స్వీకారం చేశారు.
దీని ద్వారా విజయ్ నేరుగా కొన్ని సంకేతాలను పంపారు. ప్రాథమికంగా విజయ్ ఎన్నికల ప్రచారంలో బాగా సహకరించింది యువకులు. వారు బాగా ఆకర్షితులయ్యారు. అలాగే ఇప్పటి వరకు కరుణానిధి, జయలలిత, స్టాలిన్ పూర్తిగా సంప్రదాయ ధోరణిలోనే కనిపించారు. డీఎంకే, అన్నా డీఎంకే పాలనతో యువకులు విసుగు చెందిపోయారు.దీనిని ముందే గ్రహించిన విజయ్.. ప్రచారంలోనే చాలా జాగ్రత్త వహించారు. యువకులే టార్గెట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ప్రమాణ స్వీకార సమయంలో కూడా యువతను ఆకర్షించడానికే విజయ్ ఈ కొత్త గెటప్ లో వచ్చారు.
