చిన్నారుల మెల్లకన్ను ఆపరేషన్.. తల్లిదండ్రులకు ఎల్వీపీఈఐ కీలక హెచ్చరిక!
Squint Surgery: చిన్నారుల్లో మెల్లకన్ను (స్ట్రాబిస్మస్) సమస్యను సరిచేయడానికి చేసే శస్త్రచికిత్స తర్వాత ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతోందని, దీనిపై అప్రమత్తంగా లేకపోతే చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల (ఎల్వీపీఈఐ) పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు వైద్యులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిశోధన వివరాలు తాజాగా ‘సర్వే ఆఫ్ ఆప్తాల్మాలజీ’ సంచికలో ప్రచురితమయ్యాయి.
మెల్లకన్ను శస్త్రచికిత్స..
జర్మన్ సర్జన్ డాక్టర్ జోహాన్ ఫ్రెడ్రిక్ డైఫెన్ బాచ్ 1839లో తొలిసారిగా మెల్లకన్ను శస్త్రచికిత్స చేశారు. కంటి కండరాలను స్క్లెరా అనే తెల్లగుడ్డు నుంచి విడదీసి, సరైన స్థానంలో తిరిగి అమర్చే ఈ విధానమే గత రెండు శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శస్త్రచికిత్స తర్వాత ఇన్ఫెక్షన్ రేటు 0.1 శాతంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్లకు కేవలం ‘స్టాఫిలోకాకస్’ అనే బ్యాక్టీరియానే కారణం. 10 కేసుల్లో 9 కేసుల్లో ‘మీడియల్ రెక్టస్’ అనే కండరానికి ఇన్ఫెక్షన్ సోకినట్లు అధ్యయనం తెలిపింది. ఇన్ఫెక్షన్ సోకిన 10 కేసుల్లో ఏడుగురికి తిరిగి శస్త్రచికిత్స చేయాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్ లక్షణాలు శస్త్రచికిత్స చేసిన 2.7 రోజుల్లోనే బయటపడుతున్నాయి. మొదటి రోజు కన్ను బాగున్నట్లు కనిపించినా, లోపల ఇన్ఫెక్షన్ అప్పటికే ప్రారంభమవుతుంది.
తల్లిదండ్రులకు సూచనలు..
చిన్నారులను తల్లిదండ్రులు శస్త్రచికిత్స తర్వాత నిశితంగా గమనిస్తూ ఉండాలి. తొలి వారం రోజుల్లో కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- కన్ను ఎర్రగామారటం.
- వాపు , నొప్పి.
- చీము కారడం.
- జ్వరం.
ఈ ఇన్ఫెక్షన్లు క్లోరాంఫెనికాల్, వాంకోమైసిన్ వంటి మందులకు బాగా లొంగుతాయని వైద్యులు వివరించారు.
ఇవి కూడా చదవండి






