రాబోయే రెండేళ్లు.. డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాహుబలి: ది కన్‌క్లూజన్ (Baahubali: the conclusion)తర్వాత ఒక్క సినిమాకే పరిమితం కాకుండా ఒకేసారి పలువురు డైరెక్టర్లతో పనిచేస్తూ తన కెరీర్లో దూసుకుపోతున్నాడు. అయితే ఈ ప్రయాణంలో తరచూ విదేశీ విహారాలు, షూటింగ్‌ల మధ్య బ్రేకులు తీసుకోవడం కూడా ప్రభాస్ స్టైల్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఫౌజీ(Fauzi), కల్కి 2898AD సీక్వెల్(Kalki sequel), స్పిరిట్(Spirit) సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, ఇప్పుడు పూర్తిగా స్పిరిట్‌పై ఫోకస్ పెట్టనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ కోసం ప్రభాస్ వరుసగా రెండు నెలల డేట్స్ కేటాయించడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఒకే సినిమాకు నిరంతరంగా పని చేయని ప్రభాస్, ఈసారి మాత్రం ఎలాంటి విరామాలు లేకుండా షూటింగ్లో పాల్గొనాల్సి ఉందని సమాచారం. ముఖ్యంగా భారీ యాక్షన్ ఎపిసోడ్లను ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగా, షూటింగ్ షెడ్యూల్‌ను చాలా కచ్ఛితంగా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్‌ను ప్రభాస్ ఎంత క్రమశిక్షణగా పూర్తి చేస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు కల్కి 2898AD సీక్వెల్ షూటింగ్ కోసం ప్రభాస్ త్వరలో హైదరాబాద్‌లో చిన్న షెడ్యూల్ పూర్తి చేయనున్నాడు. అలాగే ఫౌజీ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. 2027 మార్చిలో స్పిరిట్ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, ఆ ఏడాది ముగిసేలోపు ప్రభాస్ నుంచి మొత్తం మూడు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో డార్లింగ్ అభిమానులు రాబోయే రెండేళ్లను ప్రభాస్ ఫెస్టివల్‌గా భావిస్తున్నారు.






