యానిమల్ సెంటిమెంట్ తో రానున్న స్పిరిట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం ఒకేసారి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం డిలే అవుతుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ షెడ్యూల్స్ సరిగ్గా మేనేజ్ కాకపోవడం, మధ్యలో ఇతర సినిమాలకు డేట్స్ కేటాయించడం వంటి కారణాలతో ప్రాజెక్ట్‌లు వాయిదా పడుతున్నాయి. ఒకవైపు ఫౌజీ(Faujji) షూట్ పూర్తి చేయాల్సిన పరిస్థితి, మరోవైపు యూరప్ ట్రిప్స్ కారణంగా గ్యాప్‌లు రావడం ఈ ఆలస్యాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా అతను సైన్ చేసిన భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ విషయంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న స్పిరిట్(Spirit) షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ మధ్యలో నిలిచిపోయింది. అదే సమయంలో కల్కి 2898ఏడి(Kalki 2898AD) సీక్వెల్ కోసం కూడా ప్రభాస్ కీలక షెడ్యూల్స్కు హాజరవ్వాల్సి ఉంది. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) వంటి నటులతో కలిసి కొన్ని కీలక సీన్స్ షూట్ చేయాల్సి ఉండటం షెడ్యూల్‌ను మరింత క్లిష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్పిరిట్ ముందుగా అనౌన్స్ చేసిన 2027 మార్చి విడుదల తేదీకి రావడం కష్టమేనని యూనిట్ అంచనా వేస్తోంది.
ఇదే కారణంగా దర్శకుడు వంగా కొత్త రిలీజ్ ప్లాన్‌పై ఆలోచిస్తున్నట్టు సమాచారం. స్పిరిట్ ను 2027 డిసెంబర్ 1న విడుదల చేయాలని భావిస్తున్నారని టాక్. అదే తేదీకి వంగా గత సినిమా యానిమల్ రిలీజై భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, హీరోయిన్గా త్రిప్తి డిమ్రి నటిస్తున్నారు. టి-సిరీస్(T Series), భద్రకాళి పిక్చర్స్(Badrakali Pictures) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






