Holi: హోలీ రంగులు ఇంట్లోనే..!
హొలీ అంటేనే రంగుల పండుగ..
సరదాగా రంగులు జల్లుతూ ఆడుకోవడం. ఆనందంగా గడపడం… పైగా చిన్నా పెద్దా, యువత మెచ్చే పండుగ ఇది. గల్లీ నుంచి కాలేజీ వరకు ఎంతో జాలీగా చేసుకునే పండుగే హోలీ. ఈ పండుగ ఓ యూత్ ట్రెండ్ లా కూడా మారింది.
ఇంత సంబురంగా జరుపుకునే హోలీ రంగుల్లో హాని కలిగించే కాపర్ సల్ఫేట్, మెర్క్యూరి లాంటి ఎన్నో రకాల రసాయనాలు ఉంటాయని మీకు తెలుసా!
ఇవి కొందరి హెల్త్ కి పడొచ్చు. మరికొందరికి పడకపోవచ్చు. అజాగ్రత్తగా ఉంటే మాత్రం తీవ్రమైన సమస్యలు రావచ్చు. కాబట్టి కెమికల్ ఫ్రీ సహజ రంగులను వాడి, ఈ పండగకి మన చర్మాన్ని ఇలా కాపాడుకుందాం:
కెమికల్ ఫ్రీ రంగులకు ఎటువంటి రసాయనాలు అక్కర్లేదు. మన ఇంట్లో దొరికే శనగ, మైదా పిండి రకాలతోనే తయారు చేసుకోవచ్చు. అవి,
గులాబీ/ రెండ్ కలర్: బీట్ రూట్ తురుములో కప్పు నీళ్లు పోసి, బాగా కలపాలి. ఆ జ్యూస్ లో కార్న్ ఫ్లోర్ వేసి, ఆరబెట్టి పొడిలా చేసుకుంటే గులాబీ రంగు రెడీ!
పసుపుపచ్చ/ యెల్లో: 100 శాతం మైదా మిశ్రమంలో పావు శాతం పసుపును వేసి, బాగా కలిసిపోయేలా చేతులతో కలపాలి. కాస్త జల్లెడ పడితే పసుపు రంగు రెడీ.
అదే పసుపులో నిమ్మరసం కలిపితే… దానిలోని ఆమ్లగుణం వల్ల పసుపును ఎర్రగా మారుస్తుంది. అది ఎరుపు రంగు అవుతుంది.
ఇవి కూడా చదవండి
ఆకుపచ్చ/ గ్రీన్: రెండు కప్పుల కొత్తిమీర, రెండు కప్పుల పాలకూర వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ, మిక్సీ పట్టాలి. వచ్చిన జ్యూస్ ను వడకట్టి అందులోకి కార్న్ ఫ్లోర్ వేయాలి. ఆ రోజంతా ఎండబెట్టి, పొడి చేయాలి. ఒకవేళ కార్న్ ఫ్లోర్ వద్దనుకుంటే, గోరింటాకు పొడిని లేదా మైదాను కలిపితే, ఆకుపచ్చ రంగు రెడీ అయినట్లే!
ఈ మిశ్రమాన్ని కాస్త గాలి తగిలేచోట ఉంచి, పూర్తిగా ఆరాక… పొడిపొడిగా చేయాలి లేదంటే మిక్సీ పట్టి, జల్లెడ వేస్తే సరిపోతుంది.
నీలం/ బ్లూ: ఒక కప్పు నీళ్లలో రెండు స్పూన్ల బ్లూ ఫుడ్ కలర్ ను వేయాలి. మూడు కప్పుల కార్న్ ఫ్లోర్ ను ఇందులో కలిపి, ఆరబెడితే చాలు. నీలం రంగు రెడీ.
కాషాయం/ ఆరెంజ్: రెండు క్యారెట్లను ముక్కలుగా కోసి, మిక్సీకి వేసి పేస్ట్ చేయాలి. అలా వచ్చిన మిశ్రమాన్ని వడకట్టితే వచ్చే జ్యుస్ లో కార్న్ ఫ్లోర్ ను వేయాలి. ఆరబెట్టి, పొడి చేసుకుంటే ఆరెంజ్ కలర్ రెడీ.
ఇలానే 4,5 బ్లాక్ క్యారెట్లను తీసుకొని, మిక్సీ పట్టి వచ్చిన మిశ్రమంలో కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఆరాక, చేతులతో పొడి చేస్తే మీకు ఊదా రంగు వస్తుంది. ఇలా సహజంగా లభించే వాటితో నచ్చిన రంగులను ఇంట్లోనే రెడీ చేసి మీకు నచ్చిన వారి మీద ఇష్టంగా చల్లేయండి!
దుస్తులు ఏవి ధరించాలంటే…
రకరకాల హోలీ రంగుల నుంచి మన శరీరాన్ని కాపాడి ఉంచే దుస్తుల్లో కాటన్ కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇది ఎండల్లో ఆడినా ఒంటికి హాయిని, చల్లదనాన్ని కలిగిస్తుంది. రంగులను నీటితో కలిపి ఆడాలనుకుంటే మాత్రం నైలాన్ వేసుకోవచ్చు. నిండుగా ఒంటిని కప్పే లాల్చీ పైజామా లాంటి సింపుల్ గా, సౌకరంగా ఉండే దుస్తులను ధరిస్తే అంత ఇబ్బందికరంగా అనిపించదు.
సిల్క్ దుస్తుల జోలికైతే పోకపోవడమే మంచిది..
అలాగే ఒంటిపై నగలు/ వస్తువుల్ని ఎంత తక్కువగా వేసుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఆ ఆటల్లో పడి అవి ఎక్కడైనా పడిపోవచ్చు.
అలాగే కళ్లలో రంగు పడకుండా ఉండేదుకూ సన్ గ్లాసెస్ పెట్టుకుంటే హోలికి మీరిక రెడీ అయిపోయినట్లే! అందరికీ హ్యాపీ హోలీ!

















