బరువు తగ్గాలని ఈ మందులు వాడుతున్నారా? అయితే ప్రాణాలకు ముప్పే! ..
Weight Loss: బరువు తగ్గడం కోసం మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే ఇంజెక్షన్లను విచ్చలవిడిగా వాడటం ప్రాణాపాయానికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి బరువు తగ్గడానికి వైద్యుల సలహా లేకుండా ఇంజెక్షన్లు తీసుకుని, తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అతని క్లోమగ్రంథి (Pancreas) వాపునకు గురైనట్లు గుర్తించి చికిత్స అందించారు.
నిబంధనల ప్రకారం..
టైప్-2 డయాబెటిస్ చికిత్సకు వాడే సెమాగ్లుటైడ్, టెర్జెపటైడ్ వంటి ఫార్ములేషన్ మందుల పేటెంట్ గడువు ముగియడంతో అనేక కంపెనీలు వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే, నిబంధనల ప్రకారం వీటిని కేవలం మధుమేహ బాధితులు మాత్రమే వాడాలి. కానీ, బరువు తగ్గాలనుకునే వారు వీటిని విపరీతంగా ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి
దుష్ప్రభావాలు..
వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఇంజెక్షన్లు వాడటం వల్ల ఈ క్రింది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ (క్లోమగ్రంథి వాపు)
- మూత్రపిండాల సమస్యలు
- జీర్ణాశయ, పిత్తాశయ లోపాలు (పిత్తాశయంలో రాళ్లు)
- కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం
నిపుణుల వివరాల ప్రకారం..
మధుమేహ చికిత్స నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 లోపు ఉన్నవారికి ఈ మందులు అస్సలు అవసరం లేదు. BMI 30 దాటిన వారు కూడా కేవలం ఎండోక్రినాలజిస్టులు లేదా జనరల్ ఫిజీషియన్ల పర్యవేక్షణలోనే వీటిని వాడాలి. అర్హత లేని వారు ఇచ్చే సలహాలను పాటించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు.
జాగ్రత్తలు..
- డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపుల వారు వీటిని విక్రయించకూడదు.
- ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు, అనధికార వ్యక్తుల నుంచి ఇలాంటి మందులను కొనుగోలు చేయవద్దు.
- మార్కెట్లో లభించే నకిలీ ఉత్పత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (DCA) హెచ్చరిస్తోంది.
- ఏదైనా మందు వాడే ముందు సరైన వైద్య సలహా తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
ఇవి కూడా చదవండి






