Moscow: తగ్గవయ్యా ట్రంప్ తగ్గు.. మాదగ్గర కావాల్సినన్ని అణు జలాంతర్గాములున్నాయన్న రష్యా..

రష్యా-అమెరికా (Russia-America) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మాటలు కాస్తా చేతల్లోకి మారుతున్నాయి.
రష్యాది డెడ్ ఎకానమీ అన్న ట్రంప్.. ది వాకింగ్ డెడ్ చిత్రాలను గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యా భద్రతా మండలి ఉప ఛైర్మన్‌గా ఉన్న దిమిత్రి మెద్వెదెవ్.
రష్యా.. పాలస్తీనా, ఇరాన్ మాదిరిగా కాదని.. తమకు పంపే ప్రతి హెచ్చరిక కూడా ముప్పేనని.. యుద్ధం వైపు ఓ అడుగని హాట్ కామెంట్స్ చేశారు. మెద్వెదెవ్ వ్యాఖ్యలపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలు మూర్ఖపు, రెచ్చగొట్టే మాటలని విమర్శించారు. మెద్వెదేవ్ చేసిన మూర్ఖపు, రెచ్చగొట్టే బెదిరింపులకు ప్రతిస్పందనగా రష్యా భూభాగం సమీపంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరుదేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారకూడదని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
రష్యా సమీపంలో న్యూక్లియర్ సబ్ మెరైన్స్ను మోహరించామన్న ట్రంప్ వ్యాఖ్యలను రష్యా ప్రతినిధి విక్టర్ వోడోలాట్స్కీ లైట్ తీసుకున్నారు. రష్యాకు ఇప్పటికే మహాసముద్రాలపై ఉన్నతమైన వ్యూహాత్మక నియంత్రణ ఉందని కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ మహాసముద్రాలలో అమెరికా కంటే రష్యన్ అణు జలాంతర్గాముల సంఖ్య చాలా ఎక్కువని గుర్తు చేశారు. రష్యా సమీపంలో మోహరించాలని ట్రంప్ ఆదేశించిన రెండు అణు జలాంతర్గాములు చాలా కాలంగా మా నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్‌స్కీ స్పందిస్తూ.. తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో యూఎస్ జలాంతర్గాముల సంఖ్య కంటే తమవి చాలా ఎక్కువని వెల్లడించారు. వారు మోహరించినవి తమ జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయన్నారు. కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇక, దీనిపై గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్‌చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ మాట్లాడుతూ.. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో, వాషింగ్టన్‌ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్‌రోవ్ పేర్కొన్నారు.
కాగా, రష్యా-అమెరికా మధ్య పరిస్థితులు మాటలు ధాటి యాక్షన్ వరకు వెళ్లడంతో ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది. ఏకంగా రష్యాకు సమీపంలో అణు జలంతర్గాములు మోహరించాలని డొనాల్డ్ ట్రంప్ సైన్యానికి ఆదేశాలు ఇవ్వడంతో ఆ రెండు దేశాల మధ్య అసలేం జరుగుతోందని ఆందోళన నెలకొంది.