Moscow: ఆయిల్ కొనుగోళ్లపై భారత్ ను బెదిరించొద్దు.. ట్రంప్ తీరుపై రష్యా ఫైర్..!
ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అంగీకరించడం లేదన్న కోపంతో రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలంటూ చైనా, భారత్ సహా పలు దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత్ పై ట్యాక్స్ పెంచుతామంటూ హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దిగుమతులపై 25 శాతం పన్నేసిన ట్రంప్.. ఇక చూస్కోండి మరిన్ని పన్నులేస్తామంటూ మరోమారు హెచ్చరించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై సుంకాలను పెంచుతామని బెదిరించినందుకు ట్రంప్‌పై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ (Kremlin) తీవ్ర స్థాయిలో మండిపడింది. భారతదేశంపై అమెరికా అక్రమ వాణిజ్య ఒత్తిడిని కలిగిస్తోందని విమర్శించింది. సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను (Trading Partners) సొంతంగా ఎంచుకునే హక్కు ఉంటుందని అగ్రరాజ్యానికి స్పష్టం చేసింది. భారత్‌పై ట్రంప్ చేస్తున్న బెదిరింపులు అసమర్థమైనవని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ విమర్శించారు.
‘‘ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో మాతో వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాలని అగ్రరాజ్యం ఇతర దేశాలను బెదిరించడం మేం గమనిస్తూనే ఉన్నాం. అటువంటి బెదిరింపులను చట్టబద్ధమైనవిగా పరిగణించం. ఎందుకంటే సార్వభౌమ దేశాలు వాణిజ్య, ఆర్థిక సహకారం కోసం సొంతంగా తమ వాణిజ్య భాగస్వాములను (Trading Partners) ఎంచుకునే హక్కును కలిగి ఉంటాయని మేం విశ్వసిస్తున్నాం. అందుకు విరుద్ధంగా అమెరికా ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం సరైన చర్య కాదు’’ అని దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.
రష్యా యుద్ధంలో(Russia- Ukraine War) ఎంత మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా భారత్ పట్టించుకోవడం లేదని.. అందువల్ల ఆ దేశంపై గణనీయంగా సుంకాలు పెంచుతానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన మాటలపై ఇప్పటికే రష్యా స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యం క్షీణించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోందని పేర్కొంది. ఈ క్రమంలోనే తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆధునిక వలసవాదాన్ని పాటిస్తోందని తనను అనుసరించేందుకు నిరాకరిస్తున్న దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొస్తోందని రష్యా విదేశాంగశాఖ తెలిపింది.







