Putin: ట్రంప్ ఆంక్షల ఎఫెక్ట్…ఈ ఏడాది చివర్లో భారత్ కు పుతిన్….!

ట్రంప్ సుంకాల దాడి.. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను శరవేగంగా మారుస్తోంది. ఇంత మిత్రదేశంగా మెసలినా భారత్ పై ట్రంప్ ఏకంగా 50 శాతం సుంకాలు వేయడంపై.. అంతర్జాతీయంగానూ ఆందోళన పెల్లుబుకుతోంది. ఎప్పుడైతే ట్రంప్.. భారత్ ను దూరం పెడుతున్నారో.. అదే సమయంలో చిరకాల మిత్రదేశం రష్యా మరింత దగ్గరవుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇది అమెరికా దౌత్య నిపుణులు, వ్యూహకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.
రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) గురువారం ఆసక్తికర ప్రకటన చేశారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) ఈ ఏడాది చివర్లో భారత్ పర్యటనకు రానున్నట్లు తెలిపారు. సుంకాలు అమాంతం పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump).. భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వేళ పుతిన్ భారత్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ భారత్ పర్యటనతో చమురు కొనుగోలులో కీలక ప్రోత్సాహకాలు లభించే అవకాశముంది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోను చేయడం మింగుడు పడని ట్రంప్.. గత కొన్నాళ్లుగా సుంకాల పేరిట భారత్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, చిరకాల మిత్రుడు రష్యాతో సంబంధాలను బలహీనపరచుకోవడం ఇష్టం లేని భారత్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ తరుణంలో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించి, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను రష్యా బలోపేతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా.. చమురు కొనుగోలుతో పాటు, వివిధ అంశాలపై ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు అజిత్ డోభాల్ మాటల్లో తెలుస్తోంది.
ఇప్పటికే రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తోంది. ఒకవేళ ప్రోత్సాహకాలకు సంబంధించిన ఒప్పందాలు కార్యరూపం దాల్చితే.. కొనుగోలు పరిమాణం మరింత పెరుగుతుంది. ఇది ఓవిధంగా అమెరికాకు భారత్ ను దూరం చేసే ప్రక్రియే అని చెప్పొచ్చు. అయితే అమెరికా సైతం ఓ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఏదేశానికైనా స్వప్రయోజనాలే ముఖ్యం. ఇది అగ్రరాజ్యం అమెరికాకు తెలియనిది కాదు. అయితే మేం చెప్పాం.. మీరు జీహుజూర్ అనాలంటే మాత్రం అన్నివేళలా సాధ్యం కాదన్న సంగతిని ట్రంప్ సర్కార్ గుర్తెరగాల్సి ఉంది.