Nethanyahu: గాజాపై ఇజ్రాయెల్ ఆక్రమణ.. హమాస్ నిర్మూలనే లక్ష్యమన్న నెతన్యాహు..

హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా గాజాను భస్మీపటలం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇప్పటికీ తన లక్ష్యం దిశగానే ముందుకెళ్తున్నారు. ఐడీఎఫ్ దళాల బాంబింగ్ కారణంగా గాజా ..ఇప్పుడు నివాస యోగ్యం కాని స్థలంగా మారింది. విరిగిన శకలాలు, శిధిలాల క్రింద మృతదేహాలు,.. తిండికోసం విదేశీ సాయంకోసం ఎదురుచూపులు.. ఇదీ గాజావాసులకు మిగిలిన అత్యంత భయంకరమైన భవిష్యత్.. అయితే ఇది కూడా వారికి కొద్దిరోజులుగానే కనిపిస్తోంది. ఎందుకంటే గాజాను ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ దళాలు సిద్ధమైపోతున్నాయి.
దాదాపు 22 నెలలుగా ఇజ్రాయెల్- హమాస్ (Israel Hamas Conflict)ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజా (Gaza)ను స్వాధీనం చేసుకొనే ప్రణాళికలకు ఇజ్రాయెల్ (Israel) క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే…గాజాను స్వాధీనం చేసుకోవడం తమ ప్లాన్ కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) వెల్లడించారు. హమాస్‌ను నాశనం చేసి, బందీలను వెనక్కు తీసుకొచ్చి.. ఆ ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమే తమ లక్ష్యమని తెలిపారు. అదేవిధంగా.. గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు. .
‘‘యుద్ధాన్ని (Israel Hamas Conflict) అతి త్వరగా ముగించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ హమాస్ దీనికి అంగీకరించి.. ఆయుధాలు వీడి, బందీలను విడుదలకు ముందుకొస్తే.. రేపటితో ముగుస్తుంది. ఏదేమైనా గాజాను.. పాలస్తీనా అథారిటీకి, హమాస్‌కు అప్పగించం. గాజాలోని పాలస్తీనియన్లు కూడా హమాస్‌తో పోరాడుతున్నారు. కాబట్టి.. తాత్కాలిక ప్రభుత్వానికి పాలనా బాధ్యతలు అప్పగిస్తాం. సెక్యూరిటీని మేమే అందిస్తాం’’ అని నెతన్యాహు అన్నారు.