Delhi: మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం.. అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించిన భారత్..

అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ (Trump) కు భారత ప్రధాని మోడీ (Modi) గట్టి షాకే ఇచ్చారు. మీరెన్ని ఆంక్షలు వేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా .. మా దేశం ప్రయోజనాలే మాకు ముఖ్యమన్నారు. మీ ఆంక్షలకు మేం బెదిరేది లేదని తేల్చి చెప్పారు. ఈ పరిణామం అటు అమెరికాలోని దౌత్య వేత్తలు, నిపుణుల్లోనూ ఆందోళన పెంచుతోంది. అత్యంత మిత్రదేశం, ఆపై శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో రెండు దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపై విధించడంతో భారత్ దీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. అవసరమైతే ఆ భారాన్ని తామే భరిస్తామని వెల్లడించింది. మరోవైపు భారత్‌పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలో కొన్నింటి ధరలు పెరగనున్నాయి.
అయితే, అమెరికా అదనపు సుంకాల వల్ల రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదం తాత్కాలికమేనని, త్వరలోనే సమసిపోతుందని ప్రవాస భారతీయ సంఘాలు అభిప్రాయపడ్డాయి. చర్చలు ఫలించి త్వరలో ఒప్పందం కుదరనుందనే ఆశాభావం వ్యక్తం చేశాయి. 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నాయి. భారతీయ ఉత్పత్తులపై 50శాతం సుంకాలను వేయడాన్ని ఇండియన్-అమెరికన్ల నేత, బైడెన్ మాజీ సలహాదారు అజయ్ భుటోరియా ఖండించారు.
‘అమెరికాలో తక్కువ ధరలకు లభించే 50శాతం జనరిక్ మందులను భారత్ సరఫరా చేస్తోంది. ఈ సుంకాలు వాటి ధరలను పెంచుతాయి. దీనివల్ల అమెరికాలోని కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడతారు. మసాలా దినుసులు, పప్పులు, దీపావళి దుస్తుల ధరలు పెరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. దుస్తులు, పాదరక్షల ధరలు 37శాతం దాకా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు.
రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణంతో భారత్‌పై 50శాతం సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో బాంబు పేల్చారు. తదుపరి మరిన్ని ఆంక్షలను చూస్తారంటూ హెచ్చరించారు. శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌పై మేం 50శాతం సుంకాలను విధించిన విషయం మీకు తెలుసు. ఆ దేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. తొలిస్థానంలో ఉన్న చైనాకు అతి దగ్గరగా ఉంది. అందుకే భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను చూడబోతున్నారు’ అని పేర్కొన్నారు.
భారత్‌పై గతంలో విధించిన 25శాతం సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. అదనంగా విధించిన మరో 25శాతం ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. మన దేశంతోపాటు అనేక దేశాలపై సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. దీనివల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు అమెరికాకు వస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాలు 10శాతం నుంచి 50శాతం దాకా ఉన్నాయి.