Delhi: రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా, ఈయూ ద్వంద్వ వైఖరి…
ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధంలో రష్యా (Russia) కు ఆర్థిక అవసరాలు తీరేలా భారత్ ప్రవర్తిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈయూ సైతం ఇదే తరహాలా ఆరోపణలు గుప్పిస్తోంది. కాదంటే ఆంక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. అయితే దీన్ని భారత సర్కార్ తిరస్కరిస్తోంది. ఒప్పందాలకు, ఆంక్షలకు లింకు పెట్టొద్దని సూచిస్తోంది. వ్యాపార లావాదేవీలు.. తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేస్తోంది మోడీ సర్కార్. అయితే .. దీన్ని ట్రంప్ అంగీకరించడం లేదు. తప్పనిసరిగా తమ మాట వినాల్సిందేనని .. లేదంటే పన్నులు తప్పవని హెచ్చరిస్తున్నారు. పన్నులు వేస్తున్నారు కూడా.
ఇన్నిన్ని మాటలంటున్న యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం.. రష్యా నుంచి కారుచౌకగా చమురు దిగుమతులు చేసుకుంటున్నాయి. ఏ ఒక్క దేశం కూడా చమురు ఒప్పందాల నుంచి దూరం జరగడం లేదు. అంటే అమెరికా మిత్రదేశాలుగా తాము చేస్తుంది కరెక్టు… భారత్ మాత్రం తన ప్రయోజనాలను పణంగా పెట్టాలని భావిస్తున్నాయి. ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరి అని భారత విదేశాంగ శాఖ గతంలోనే స్పష్టం చేసింది.
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ 2024 ఫిబ్రవరి నాటి లెక్కల ప్రకారం.. యూరోపియన్ యూనియన్ దేశాలు.. రష్యా నుంచి 21.9 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకొన్నాయి. 2024 సంవత్సరానికి ఈయూ డేటా ప్రకారం ద్వైపాక్షిక వాణిజ్యం 67.5 బిలియన్ యూరోలు. కానీ, యుద్ధం కోసం ఉక్రెయిన్‌కు ఈయూ చేసిన సాయం 19 బిలియన్ యూరోలు మాత్రమేనని ది గార్డియన్ పత్రిక తెలిపింది. అంటే.. కీవ్‌కు ఇచ్చే మొత్తం కంటే.. మాస్కోకు సమకూర్చే సొమ్మే ఎక్కువన్నమాట. అంతెందుకు అమెరికా-రష్యా 2024 సంవత్సరంలో జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 5.2 బిలియన్ డాలర్లు. అమెరికా, ఈయూ దేశాలు దీనిపై నోరు మెదపవు.
మరోవైపు…అమెరికా మాజీ రాయబారి ఎరిక్ గార్సెట్టీ కొన్నాళ్ల క్రితం చేసిన ప్రసంగం వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను స్థిరీకరించేందుకు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేసేలా అమెరికానే ప్రోత్సహించిందన్నారు. గతేడాది జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ రష్యా చమురును ధర పరిమితి వద్ద ఎవరో ఒకరు కొనుగోలు చేయాలని మేము కోరుకున్నాం కాబట్టే వారు (భారత్) దిగుమతి చేసుకొన్నారు. అది ఉల్లంఘనో, మరొకటో కాదు. ఆ పాలసీనే అలా తయారుచేశారు. అది నిత్యావసరం కావడంతో.. చమురు ధరలు పెరగాలని మేము కోరుకోము. దానిని వారు పూర్తి చేశారు’’ అని పేర్కొన్నారు.







