Pakistan: పాకిస్తాన్ సర్కార్ కు ఇమ్రాన్ టెన్షన్.. విడుదల చేయాలంటూ దేశవ్యాప్త ఆందోళనలు, అరెస్టులు..

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టై రెండేళ్లు పూర్తయ్యాయి. ఒకరిద్దరికి తప్ప ఎవరినీ .. ఆయనను కలిసేందుకు ప్రభుత్వం, ఆర్మీ అవకాశం కల్పించడం లేదు.చివరకు ఆయన భార్య సైతం .. పలు కేసుల్లో అరెస్టయ్యారు. దీంతో ఆయనను విడుదల చేయాలంటూ పీటీఐ నేతలు, కార్యకర్తలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. లేటెస్టుగా స్వయంగా ఆందోళనలు చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ పిలుపునివ్వడంతో.. లక్షలాది మంది కార్యకర్తలు రొడ్డెక్కారు. దీంతో ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఇమ్రాన్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో 500మందికిపైగా పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారని పీటీఐ ఆరోపించింది. పంజాబ్ ప్రావిన్స్‌లోనే ఎక్కువ మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది.
ఇవాళ్టి నిరసనలను అడ్డుకునేందుకు షెహబాజ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని..ఆ పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల అధికార ప్రతినిధి బుఖారీ మండిపడ్డారు.జనాలు గుంపులు గుంపులుగా ఉండొద్దని ఆదేశాలు జారీ చేసిందని, హైవేలను మూసివేసిందని, కార్లపై పీటీఐ జెండాలు ఉంటే.. వాటిని రోడ్ల మీదకి రాకుండా అడ్డుకుందంటూ పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ప్రజలపైనే ఇలా నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. వివిధ కేసులను ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైల్లో ఉన్నారు.