Bangladesh: టార్గెట్ హసీనా.. మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ప్రతీకారం…
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్’ (ICT) అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే ఆయా కేసుల్లో హసీనాపై విచారణను ప్రారంభించింది. తాత్కాలిక ప్రభుత్వం నియమించిన చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం.. హసీనాను అన్ని నేరాలకు మూలకేంద్రంగా పేర్కొన్నారు. ఆమెకు గరిష్ఠ శిక్ష విధించాలన్నారు. ఈ కేసుల్లో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీపీ చౌదురీ అబ్దుల్లా అల్ మామున్లు సహ నిందితులుగా ఉన్నారు.
విద్యార్థుల ఆధ్వర్యంలో గత ఏడాది జులై-ఆగస్టులో జరిగిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు హసీనా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భారీ సంఖ్యలో ఉద్యమకారులను చంపించడం, హింసించడం వంటి నేరాభియోగాలను ఆమెపై మోపారు. వీటిపై ఐసీటీ విచారణను ప్రారంభించింది. హసీనా, అసదుజ్జమాన్లు ఇప్పటికే దేశాన్ని వీడారు. మామున్ ఒక్కరే కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో సాక్షిగా మారేందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. నిరసనల సమయంలో గాయపడిన వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి ఆధారాలు సమర్పిస్తామని ప్రాసిక్యూషన్ తెలిపింది.
గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు హోంశాఖ మాజీ మంత్రి కూడా బంగ్లాదేశ్‌ను వీడారు. ఈ క్రమంలోనే స్థానికంగా నోబెల్ పురస్కార గ్రహీత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయా కేసుల్లో విచారణ కోసం హసీనాను అప్పగించాలని భారత్‌ను అభ్యర్థిస్తోంది. ఇదిలా ఉండగా.. జులై 10న హసీనా, కమల్, మామున్‌లపై ఐసీటీ అభియోగాలు మోపింది. అంతకుముందు కోర్టు ధిక్కరణ కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.







