Donald Trump: విదేశీ ప్రతిభ అవసరమే అంటున్న ట్రంప్…!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) .. కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ఆయన ప్రభుత్వం హెచ్ 1బీ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు దేశంలోని కొన్ని పరిశ్రమలకు విదేశీ ప్రతిభ ఎంతో అవసరమని ఆయన స్వయంగా చెప్పారు. అమెరికాకు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిపుణులు అవసరమని, వారిని విదేశాల నుంచి తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్‌ను హెచ్-1బీ వీసాలపై ప్రశ్నించారు. మీ ప్రభుత్వం ఈ వీసాలకు ప్రాధాన్యత తగ్గిస్తోందా అని అడగ్గా, ఆయన బదులిస్తూ “దేశంలోకి ప్రతిభను తీసుకురావాల్సిందే” అని అన్నారు. ఇంటర్వ్యూ చేస్తున్న లారా ఇంగ్రహమ్ “మన దగ్గర చాలా ప్రతిభ ఉంది” అనగా, ట్రంప్ వెంటనే “లేదు, మన దగ్గర లేదు” అని బదులిచ్చారు.”నిరుద్యోగ జాబితాలో ఉన్న ఒకరిని తీసుకొచ్చి, ఫ్యాక్టరీలో క్షిపణులు తయారు చేయమని చెప్పలేం కదా? కొన్ని నైపుణ్యాలు మన దగ్గర లేవు. ప్రజలు నేర్చుకోవాలి” అని ట్రంప్ వివరించారు.
మరోవైపు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో హెచ్-1బీ వీసాల వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశీ వీసాదారుల స్థానంలో ఫ్లోరిడా నివాసితులను నియమించాలని, ఇది చౌక కార్మిక విధానమని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో సహా పలు సంస్థలు కోర్టులో కేసులు వేశాయి. ఐదుగురు చట్టసభ సభ్యులు భారత్-అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ట్రంప్‌కు లేఖ రాశారు.
2024లో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందారు. అమెరికాలో నైపుణ్యం కలిగిన వలసదారుల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు..






