Chandrababu: పనిచేస్తేనే పదవులంటున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. ట్రెండ్ ను బట్టి మారుతుంటారు.. తనలాగే పార్టీ నేతలు కూడా మారాలని పదేపదే చెబుతుంటారు. ఇప్పటివరకూ చంద్రబాబు అనుసరించే తీరు ఒకలా ఉండేది. ఎవరైనా నేతలు సరిగ్గా పనిచేయకున్నా.. ప్రజల్లో ఉండకపోయినా.. వారికి సమయమిచ్చేవారు. అంతేకాదు.. ఎన్నికల వరకూ వేచి చూసి, అప్పుడు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేవారు. కానీ .. ఇప్పుడా ట్రెండ్ ను మార్చేస్తున్నారు చంద్రబాబు. ఎవరైనా పనిచేయకుంటే.. తక్షణమే పక్కన పెడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
‘ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు సక్రమంగా పనిచేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచిచూడం. ఈలోపే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం. వేచి చూసే పక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇప్పుడు తప్పులు చేస్తాం. ఎన్నికల ముందు చూసుకుందామంటే ఎవరూ క్షమించరు. పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాం. అందులో భాగంగా నెలవారీగా నియోజకవర్గాలపై అభిప్రాయసేకరణ చేపట్టి హెచ్చరికలు చేస్తాం. మార్పురాని పక్షంలో ప్రత్యామ్నాయం వెతుకుతాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ టీడీపీ సమావేశంలో చంద్రబాబు ఈ హెచ్చరికలు చేశారు.
పార్టీ, ప్రభుత్వంపై తరచూ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాం. మైనారిటీల మద్దతు పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకించి మహిళల ఆదరణ ఎక్కువగా ఉంది. రాయలసీమలో అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లో 12 గెలిచాం. కొన్ని తప్పుల కారణంగా మిగిలినవి పోగొట్టుకున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పనితీరు మరింతగా మెరుగుపర్చుకోవాలంటూ వివిధ ర్యాంకులను చదివి వినిపించారు. తన పనితీరుపైనా ప్రజాభిప్రాయాన్ని తెప్పించుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. పదవులు పొందిన పలువురు నేతలు సమావేశానికి హాజరుకాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురి పేర్లు ప్రస్తావించి వచ్చారా లేదా అంటూ ఆరాతీశారు. డిసెంబరు 1 నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరమవుతాయని.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు, జోనల్ ఇన్‌ఛార్జులు మరింత కీలకంగా వ్యవహరించాలని అధినేత సూచించారు.
పార్టీ ఇకపై ఓడిపోవడమంటూ జరగదు. మన విజయానికి ఎన్నో వ్యూహాలున్నాయి. కార్యకర్తలు సంతృప్తికరంగా ఉండటానికి అన్ని రకాల చర్యలు చేపట్టాం. జెండా మోసినవారి త్యాగాలు గుర్తున్నాయి. ఎవరినీ విస్మరించడం లేదు. వారి అభిప్రాయానికే విలువిచ్చి పదవులిచ్చాం. చాలాచోట్ల పార్టీ శ్రేణులు తిరస్కరించడంతో పలువురిని పదవుల నుంచి పక్కనపెట్టాం. కార్యకర్తలు, నేతల కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందిస్తున్నామని గుర్తు చేశారు చంద్రబాబు.






