Santhana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – విక్రాంత్
“సంతాన ప్రాప్తిరస్తు” (Santhana Prapthirasthu ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యంగ్ హీరో విక్రాంత్. ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో విక్రాంత్.
– మా స్వస్థలం విజయవాడ. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఉండేది. పెద్దవాళ్లు ఎవరైనా సినిమాకు వెళ్తుంటే వాళ్లతో పాటు వెళ్లేవాడిని. చదువుకుని సాఫ్ట్ వేర్ కెరీర్ లోకి వచ్చాను. యూఎస్ వెళ్లి జాబ్ చేశా. అమెరికాలో ఇక్కడి కంటే ఎక్కువ సినిమాలు చూసేవాడిని. కోవిడ్ టైమ్ లో ఇక ఇలాగే వెయిట్ చేస్తుంటే లైఫ్ చూస్తుండగానే గడిచిపోతుంది అనిపించింది. ఇండియాకు వచ్చాను. కోవిడ్ మూడు నెలలకు మించి ఉండదు అనుకుంటే రెండేళ్లు పట్టింది. ఫ్యామిలీ నుంచి ప్రెషర్ పెరిగింది. ఈ టెన్షన్ లో స్పార్క్ అనే ఒక మూవీ చేశాను. ఆ సినిమా నాకు చేదు అనుభవం మిగిల్చింది. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని థియేటర్ ద్వారా నటనను మెరుగుపర్చుకున్నా.
– ఆ తర్వాత ఒకరోజు శ్రీధర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన సంతాన ప్రాప్తిరస్తు స్క్రిప్ట్ పంపించారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే హీరో కథ ఇది. మన తెలుగు ఆడియెన్స్ కు నచ్చుతుందా అనే సందేహం ఉండేది. అయితే స్క్రిప్ట్ కంప్లీట్ గా చదివాక ఎక్కడా లైన్ క్రాస్ కాకుండా, అసభ్యత లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూసేలా కథ ఉంది. దాంతో ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం కలిగింది. పెద్ద హీరోలు ఇలాంటి మూవీస్ చేయరు. వారికి ఇమేజ్ అడ్డు వస్తుంది. నాలాంటి కొత్త వాళ్లే ఇలాంటి డిఫరెంట్ ప్రయత్నాలు చేయాలి. పైగా కోవిడ్ తర్వాత వరల్డ్ సినిమాకు మనమంతా అలవాటు అయ్యాం. కొత్త జానర్, కొత్త కథలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నాలాంటి కొత్త హీరోలు రెగ్యులర్ ఫార్మేట్ మూవీస్ చేస్తే ఎవరికీ నచ్చదు. డిఫరెంట్ మూవీస్ చేయాలి, అందరికీ రిలేట్ అయ్యేలా ఉండాలి అనుకున్నా. “సంతాన ప్రాప్తిరస్తు”లో కథ ఇన్ ఫెర్టిలిటీ అనే ఒక సెన్సిటివ్ ఇష్యూను తీసుకుని దానికి ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేశాం. సినిమా మూడొంతులు ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుంది, చివరలో మంచి ఎమోషన్ తో, మెసేజ్ తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు.
– దర్శకుడు సంజీవ్ గారు 2017 నుంచి సిద్ధం చేసుకున్న స్టోరీ ఇది. ఎక్కడా ఒక్క సీన్ కూడా కదల్చనంత పక్కాగా స్క్రిప్ట్ చేశారు. ఈ మూవీలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రోల్ చేశాను. ప్రతి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఈ క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు. ఈ పాత్ర కోసం ఆరు కిలోల బరువు పెరిగాను. టిపికల్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లుక్ లోకి మారిపోయాను. ఇప్పుడున్న కపుల్స్ లో సంతాన సమస్య ఎక్కువగా ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతి పది జంటల్లో మూడు జంటలు ఇన్ ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు. సంతాన లేమి అనే సమస్యను మేము ఎక్కడా కామెడీ చేయలేదు. వాళ్లను గేలి చేయలేదు. ఆ సమస్య చుట్టూ ఎంటర్ టైన్ మెంట్ డిజైన్ చేశాం. కాబట్టి ఎవర్నీ కించపరిచినట్లు ఉండదు. పైగా ఈ సినిమా చూశాక ఇన్ ఫెర్టిలిటీతో బాధపడుతున్నా వారికి ఒక హోప్ కలుగుతుంది.
– మంచి మూవీస్ చేసి పేరు తెచ్చుకున్న చాందినీ మా చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. చాందినీ, నేను కొన్ని సీన్స్ వర్క్ షాప్ చేసి సెట్ మీదకు వెళ్లాం. నా క్యారెక్టర్ తర్వాత చాందినీ, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ సినిమాలో కీలకంగా ఉంటాయి. తరుణ్ భాస్కర్ నా అభిమాన దర్శకుడు. ఆయన ఈ సినిమాలో జాక్ రెడ్డి రోల్ చేశారు. తరుణ్ భాస్కర్ గారితో కలిసి నటించడం మర్చిపోలేను. సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్ ఫాదర్ రోల్ లో మురళీధర్ గౌడ్ నటించారు. ఆయన తన కూతురును ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ చాందినీ నన్ను ప్రేమిస్తుంది. మేము ప్రెగ్నెన్సీ విషయంలో వంద రోజుల ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు కొత్త జంటలు మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ చెప్పేవారట. ఇప్పుడు ఆ టైమ్ 19 నెలలకు పెరిగిందని ఒక సర్వేలో తేలింది. అంటే మనం లైఫ్ లో స్ట్రెస్, పరుగుల వల్ల, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాల వల్ల పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవడమో లేదా పిల్లల్ని కనే సామర్థ్యం తగ్గిపోవడమో జరుగుతోంది.
– మా మూవీ షూటింగ్ త్వరగా పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ కు టైమ్ పట్టింది. సునీల్ కశ్యప్ గారు ఇతర ప్రాజెక్ట్స్ లో బిజిగా ఉండటం వల్ల బీజీఎం అజయ్ అరసాడ చేశారు. ఆయన చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. దాంతో పాటు తెలుసా నీ కోసమే సాంగ్ కూడా కంపోజ్ చేశారు. మా సినిమాలో పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. మా సినిమాకు ఓటీటీ రిలీజ్ కోసం మంచి ఆఫర్స్ వచ్చాయి. సినిమా బాగుండటంతోనే ఓటీటీలు తీసుకునేందుకు ముందుకొచ్చాయి.
– సినిమాలో సాంగ్స్, ఫన్ అన్నీ ఆర్గానిక్ గా కుదిరాయి. ఏదీ కావాలని తీసుకొచ్చి ఇరికించినట్లు ఉండదు. సెన్సార్ నుంచి కూడా మాకు ప్రశంసలు వచ్చాయి. యుఎ సర్టిఫికేషన్ ఇచ్చారు. దీన్ని బట్టే డైరెక్టర్ సంజీవ్ గారు సినిమాను ఎంత సెన్సిటివ్ గా డీల్ చేశారో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా పలు చోట్ల ప్రీమియర్స్ వేశాం. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడలేదని ఆడియెన్స్ మా దగ్గరకు వచ్చి చెప్పడం హ్యాపీగా అనిపించింది.
– ఈ సినిమా తర్వాత శ్రీధర్ గారి బ్యానర్ లోనే దర్శకుడు సంజీవ్ రెడ్డితో సర్పంచ్ అనే మూవీ చేయబోతున్నా. గ్రామీణ నేపథ్యంగా సాగే చిత్రమిది. ఈ కథలోనూ కొన్ని సోషల్ ఇష్యూస్ చెబుతున్నా, ఈ చిత్రంలో లాగా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో వెళ్తున్నాం. మృత్యుంజయ మార్కండేయ అనే మరో సోషియో ఫాంటసీ మూవీకి ప్రయత్నాలు చేస్తున్నాం.






