BANGLADESH: షేక్ హసీనా ఇంటర్వూలు.. బంగ్లాదేశ్ సర్కార్ లో వణుకు…?
బంగ్లాదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో మరోసారి భారత్, బంగ్లా దేశ్ మధ్య వివాదం ఏర్పడింది.‘‘పరారీలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాను స్థానిక మీడియాతో సంభాషించేందుకు భారత్ అనుమతించింది. దీనిపై బంగ్లాదేశ్ (Bangladesh) విదేశాంగశాఖ .. భారత డిప్యూటీ హైకమిషనర్ పవన్ను పిలిపించి.. అధికారికంగా నిరసన తెలిపింది. హసీనాను మీడియాతో మాట్లాడేందుకు అనుమతించకూడదనే తమ అభ్యర్థనను తెలియజేయాలని చెప్పింది’’ అని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ బంగ్లా అధికారిక మీడియా పేర్కొంది.
‘‘మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు షేక్ హసీనా విచారణ ఎదుర్కొంటున్నారు. పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయం కల్పించడం, స్వదేశంలో ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, ఉగ్రచర్యలను ప్రోత్సహించేందుకు వేదిక కల్పించడం.. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి మేలు చేయవు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగశాఖ చెప్పినట్లు సమాచారం.
మరోవైపు.. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాదేశ్లో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని.. ‘పీటీఐ’కి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో షేక్ హసీనా పేర్కొన్నారు. బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేత, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగివెళ్తానని అన్నారు. అటువంటి పరిస్థితులనే అక్కడి ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు.






