Pakistan: పాకిస్తాన్ సుప్రీం ఆసిం మునీర్..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ .. ఇప్పుడు మహా శక్తిమంతుడు. ఎంతలా అంటే పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సుప్రీంకోర్టు కన్నా అధికుడనడంలో సందేహం లేదు. ఆయనకు అపరిమిత అధికారాలిస్తూ చేసిన రాజ్యాంగ సవరణను అక్కడి పార్లమెంటు ఆమోదించింది. విపక్షం ఆందోళనలను బేఖాతర్ చేస్తూ.. రాజ్యాంగ సవరణకు ఆమోదం లభించింది.
27వ రాజ్యాంగ సవరణకు పార్లమెంటు దిగువ సభ మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మెజారిటీతో ఆమోదం లభించింది. కేవలం నలుగురు శాసనసభ్యులు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎగువ సభలో రెండు రోజుల క్రితమే బిల్లుకు ఆమోదం లభించింది. రాష్ట్రపతి సంతకం అనంతరం ఇది చట్టంగా మారనుంది. దీని ప్రకారం.. ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఆసిం మునీర్ పదవీకాలం పూర్తయిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదం తెలిపిన అనంతరం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) దీనిపై స్పందించారు. ఇది జాతీయ ఐక్యతకు కీలక అడుగుగా అభివర్ణించారు. వైమానిక, నావికాదళాల గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తాజా సవరణ ప్రకారం.. రాజ్యాంగ కేసులను నిర్వహించడానికి కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు (FCC) ఏర్పాటుకానుంది. ఇందులో పాక్ సుప్రీం కోర్టు పాత్ర తగ్గనుంది. ఈ ఎఫ్సీసీకి న్యాయమూర్తులను ప్రభుత్వం నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వ విధానాలను సుప్రీం అడ్డుకోవడంతో పాటు ప్రధాన మంత్రులను తొలగించింది. ఈ క్రమంలో ఈ ఎఫ్‌సీసీ ఏర్పాటుకు షరీఫ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ సవరణను ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్‌తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఓటింగ్ సమయంలో వీరు వాకౌట్ చేశారు.






