Pawan Vs Peddireddy: పెద్దిరెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (Peddireddy Ramachandra Reddy) అటవీ భూముల అక్రమాలపై సంచలన ఆరోపణలు చేశారు. శేషాచల అటవీ ప్రాంతంలోని మంగళంపేట అటవీ భూముల్లో భారీ ఎత్తున కబ్జాలకు పాల్పడినట్లు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుపతి పర్యటనలో భాగంగా సైట్‌ను స్వయంగా సందర్శించిన పవన్ కళ్యాణ్.. సుమారు 76.74 ఎకరాలను అక్రమంగా ఆక్రమించినట్లు పేర్కొన్నారు. అక్కడ అక్రమ కట్టడాలు నిర్మించినట్లు చెప్పారు. ఈ భూములన్నీ మాజీ అటవీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించినవని ఆయన నేరుగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్స్ను బహిర్గతం చేయడం సంచలనం సృష్టిస్తోంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించడంతో పాటు, భవిష్యత్తులో అటవీ భూముల పరిరక్షణకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం, కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్సైట్లో బహిర్గతం చేయాలని ఆదేశించారు. తద్వారా పారదర్శకత లభిస్తుందన్నారు. అంతేకాక, నకిలీ వెబ్‌ల్యాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విజిలెన్స్, లీగల్ టీమ్‌లతో విచారణకు ఆదేశించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి అని, వాటిని కబ్జా చేసేవారిని, అటవీ ప్రాంతాలపై దండయాత్ర చేసినవారికి కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
అయితే, ఈ ఆరోపణలపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆయన ‘ఎక్స్’ వేదికగా పవన్ కళ్యాణ్‌పై ఎదురుదాడి చేశారు. ‘షూట్ చేసి స్కూట్ అవ్వడంలో’ అంటే ఆరోపణలు చేసి తర్వాత వెనక్కి తగ్గడంలో పవన్ కల్యాణ్ నిపుణులు అని విమర్శించారు. గతంలో ఎర్రచందనం విషయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. హెలికాప్టర్ నుంచి చూపించిన భూమి తమ చట్టబద్ధమైన సొత్తు అని మిథున్ రెడ్డి ధృవీకరించారు. తాము ఆ భూమిని 2000 సంవత్సరంలో కొనుగోలు చేశామని, ఆ సమయంలో తాము అధికారంలో లేమని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అమాయకంగా మాట్లాడుతున్నారా లేక తమ కుటుంబంపై ద్వేషంతో మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.
ఆరోపణలను నిరూపించాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్‌కు మిథున్ రెడ్డి సవాలు విసిరారు. ఆ భూమికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉన్న పత్రాల్లో ఉన్నాయని, వాటిని పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై చాలా విచారణలు జరిగాయని, ఎలాంటి అక్రమాలు లేవని గతంలోనే నిర్ధారించబడిందని వాదించారు. అయితే ఇక్కడ భూమి ఎప్పుడు కొనుగోలు చేశారు.. ఎవరు కొనుగోలు చేశారనేది ముఖ్యం కాదు. అది రిజర్వ్డ్ ఫారెస్ట్ పరిధిలో ఉందా.. లేదా అనేదే కీలకం. పవన్ కళ్యాణ్ ఆదేశించిన విజిలెన్స్ విచారణ, భూ రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా ఈ వివాదానికి సంబంధించిన చట్టపరమైన చిక్కులు, తప్పుడు రికార్డుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.






