Mohan babu: తర్వాత మోహన్ బాబే.. ప్లాన్ తో దిగుతున్న పోలీసులు

సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan babu) వ్యవహారంలో తెలంగాణ పోలీసులు త్వరలోనే కీలక అడుగులు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బయలు పిటిషన్ మోహన్ బాబు దాఖలు చేయగా ఆ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. సోమవారం దీనిపై హైకోర్ట్ లో (High court) వాదనలు జరగగా ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ధర్మాసనం సమ్మతించలేదు. ఈ నెల 10న పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన ఫామ్హౌస్ వెలుపల న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన ఒక విలేకరిపై మోహన్ బాబు దాడి చేశారు.
ఈ దాడిలో విలేకరి తీవ్రంగా గాయపడటంతో ఈ ఘటనపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు ప్రకారం మోహన్ బాబుకు నోటీసులు జారీ చేయగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని… అరెస్టు అలాగే తదుపరి దర్యాప్తు చేయకుండా పోలీసులు ఆదేశించాలని మోహన్ బాబు పిటిషన్లో కోరారు. దీనిపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ కె లక్ష్మణ్ ఈ పిటీషన్ లపై విచారణ నిర్వహించారు. దీనికి సంబంధించి మోహన్ బాబు తరపు న్యాయవాది కూడా తన వాదన వినిపించారు.
అయితే అసలు ఆ గాయపడిన విలేఖరికి మోహన్ బాబుకి ఎటువంటి పరిచయం లేదని, ఆయన ఎవరో కూడా మోహన్ బాబుకి తెలియదని… అలాంటప్పుడు అసలు అతనిపై హత్యాయత్నం ఏ విధంగా చేస్తారని, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏమాత్రం సరైనవి కాదని మోహన్ బాబు తరుపు న్యాయవాది వాదనలను వినిపించారు. అలాగే మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలను, చిన్న చిన్న గొడవలను పలు మీడియా ఛానల్స్, సోషల్ మీడియా పెద్దవిగా చేసి చూపించాయని కోర్ట్ కు తెలిపారు.
మంచు మనోజ్ తో కలిసి వచ్చిన బౌన్సర్లతో ప్రాణహాని ఉందనే భయంతోనే మోహన్ బాబు ఆ విధంగా దాడి చేశారని అనుకోకుండా జరిగిన ఘటన అంటూ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే బాధితుడు వాంగ్మూలం ఆధారంగానే పోలీసుల కేసు నమోదు చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనను వినిపించారు. దీనిపై వాదనలను విన్న న్యాయమూర్తి మోహన్ బాబు బెయిల్ పిటీషన్ ను కొట్టేశారు. అయితే తాను విచారణకు హాజరైన రోజే ట్రయల్ కోర్టులో బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు తరపు న్యాయవాది కోరగా ఆ విజ్ఞప్తిని కూడా హైకోర్టు తిరస్కరించింది. దీనితో తెలంగాణ పోలీసులు మోహన్ బాబు అరెస్టు చేయడం ఖాయమనే స్పష్టత వస్తుంది.