Tollywood: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ మీటింగ్.. లోపల ఏం జరిగింది.!?

తెలుగు సినీరంగ ప్రముఖులంతా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సమావేశమయ్యారు. అల్లు అర్జున్ (Allu Arjun) వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో అటు ప్రభుత్వానికి, ఇటు సినీ ఇండస్ట్రీకి (Cinema industry) మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. దీనికి చెక్ పెట్టేందుకు FDC ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) చొరవ తీసుకున్నారు. సినీరంగంలోని ప్రముఖులందరినీ ఓ వేదిక పైకి తెచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశపర్చారు. ఇందులో తెలుగు సినిమా ఇండస్ట్రీని గ్లోబల్ లెవల్ కు తీసుకెళ్లేందుకు ఏం చేయాలో ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని సినీ పెద్దలు హామీ ఇచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 36 మంది ప్రముఖులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సమావేశం జరిగింది. నిర్మాతలు సురేశ్ బాబు, కె.ఎల్.నారాయణ, దామోదర్, అల్లు అరవింద్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, చినబాబు, డీవీవీ దానయ్య, కిరణ్, మైత్రీ రవి, స్రవంతి రవికిశోర్, నాగబాబు, టి.జి.విశ్వ ప్రసాద్, ప్రసన్న, యు.వి.వంశీ, సుధాకర్ రెడ్డి, సితార వంశీ, సునీల్-అనుపమ్, గోపీ, సి.కల్యాణ్, రమేశ్ ప్రసాద్, భరత్ భూషణ్ తదితరులు హాజరయ్యారు.
అలాగే దర్శకులు కె.రాఘవేంద్ర రావు, అనిల్ రావిపూడి, కొరటాల శివ, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, వీర్ శంకర్, త్రివిక్రమ్, బాబీ, వేణు శ్రీరామ్, బలగం వేణు, విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఇక నటులు నాగార్జున, వెంకటేశ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కల్యాణ్ రామ్, శివబాలాజీ, అడవి శేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, పోతినేని రామ్ తదితరులు హాజరయ్యారు.
సినిమా రంగాన్ని ప్రోత్సహించడంలో అందరు సీఎంలు ఎంతో బాగా చూసుకున్నారని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) అన్నారు. ఈ ప్రభుత్వం కూడా బాగా చూసుకుంటోందనన్నారు. దిల్ రాజును FDC ఛైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. గతంలో హైదరాబాద్ లో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించారని.. ఇప్పడు కూడా నిర్వహిస్తే బాగుంటుందని రాఘవేంద్ర రావు సూచించారు. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయన్నారు. యూనివర్శల్ స్టూడియోస్ లెవల్లో హైదరాబాద్ లో స్టూడియో సెటప్ ఉండాలని నాగార్జున (Nagarjuna ) ఆకాంక్షించారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ ఆకాంక్ష అన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏవైనా చిన్న చిన్న విషయాలు ఉంటే వాటిని పట్టించుకోవద్దని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి (Syam Prasad Reddy) సూచించారు. తాను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ ను చూస్తున్నానని.. దీన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
సినిమా రిలీజ్ ఎప్పుడూ ఎలక్షన్ రజల్ట్ లాగే ఉంటుందని మురళీ మోహన్ (Murali Mohan) అన్నారు. కాంపిటీషన్ వల్లే సినిమాల ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాలు రిలీజ్ అవుతున్నందున ప్రమోషన్ విస్తృతంగా చేయాల్సి వస్తోందని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందన్నారు. టికెట్ రేట్ల పెంపుపై పునరాలోచించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తనకు ఎవరి మీదా వ్యక్తిగత కక్షలు ఉండవన్నారు. మహిళ ప్రాణాలు కోల్పోయినందువల్లే సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. బెనిఫిట్ షోల విషయంలో తాము అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటామన్నారు. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి సినీ పెద్దలంతా సరేనన్నారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు (Daggubati Suresh Babu) అన్నారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా మార్చాలనేది తమ ధ్యేయమన్నారు. ప్రభుత్వ సాయంతోనే నాడు మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తెలుగు సినీ పరిశ్రమ తరలి వచ్చిందన్నారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఓవరాల్ గా సీఎంతో మీటింగుపై సినీ ఇండస్ట్రీ సంతృప్తిగానే ఉంది. గ్యాప్ భర్తీ అయిందని భావిస్తున్నారు.