Sree Leela: శ్రీలీల ఆశలన్నీ ఆ సినిమాపైనే!
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే క్రేజ్ సంపాదించిన శ్రీలీల(Sree Leela) ఇప్పుడు కెరీర్లో కీలక మలుపు దగ్గర నిలిచింది. ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఆమె, ఇటీవల వచ్చిన ఫలితాలతో కాస్త వెనకబడిందనే చర్చలు వినిపిస్తున్నాయి. గత కొన్ని సినిమాల్లో ఒక్క భగవంత్ కేసరి(Bhagavanth Kesari) మినహా పెద్దగా హిట్లు లేకపోవడం ఆమె మార్కెట్‌పై ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టాలీవుడ్లో అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కథల ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు విశ్లేషకులు. బలమైన కథలు కాకుండా సాధారణ స్క్రిప్ట్స్‌ను అంగీకరించడం, కొన్ని స్టార్ కాంబినేషన్లు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం ఆమె కెరీర్‌ను ప్రభావితం చేశాయని అభిప్రాయం. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) వంటి ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు నెరవేరకపోవడం మరింత నెగెటివ్ ఇంపాక్ట్ కలిగించింది. రిలీజ్ టైమింగ్, మార్కెట్ పరిస్థితులు కూడా కలిసి రాకపోవడం ఫలితాలపై ప్రభావం చూపిన అంశాలుగా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఫలితాలు ఆశించినట్టుగా లేకపోయినా ఆమె రెమ్యూనరేషన్ డిమాండ్ మాత్రం తగ్గలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అయితే బాలీవుడ్లో కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) తో చేయనున్న సినిమా ఆమెకు కొత్త అవకాశాల రూట్ కావొచ్చు. ఆ సినిమా సక్సెస్ అయితే తిరిగి ఫామ్‌లోకి రావడం సులభం కానుంది. లేకపోతే శ్రీలీల కెరీర్ మరింత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.
