Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్‌కు చిరంజీవి దూరం..! ఎందుకు..??

తెలుగు సినిమా పరిశ్రమ (tollywood) ఇప్పుడు కష్టకాలం ఎదుర్కొంటోంది. తెలంగాణ ప్రభుత్వంతో (Telangana Govt) ఏర్పడిన పేచీ నుంచి బయటపడేందుకు ఆపసోపాలు పడుతోంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు (FDC Chairman Dil Raju) చొరవతో సినిమా ప్రముఖులతో భేటీ కావడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అంగీకరించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూంలో ఈ సమావేశం జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీ నుంచి మొత్తం 36 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా భావించే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నారు. ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ ఎలాంటి చిన్న సమస్య వచ్చినా అందరూ ఎదురు చూసేది చిరంజీవికోసమే. ఆయనైతేనే ఆ సమస్యకు పరిష్కారం చూపగలరనేది ఇండస్ట్రీ నమ్మకం. గతంలో దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారు. ఇండస్ట్రీని ఏకతాటిపై నడిపించే వారు. దాసరి తర్వాత ఇప్పుడు చిరంజీవి మాత్రమే ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ చిరంజీవి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ముందుటున్నారు. ఆయన కూడా తన వద్దకు ఎలాంటి సాయం కోరి వచ్చినా చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటున్నారు.
అయితే ఇప్పుడు తన అల్లుడు అల్లు అర్జున్ (Allu Arjun) వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన్ను అరెస్టు చేసేంతవరకూ వెళ్లింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి తన బావమరిది ఇంటికెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి ఇంటికెళ్లి కలిశారు. అయితే అల్లు అర్జున్ ను పరామర్శించిన వారిపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏం జరిగిందని ఇండస్ట్రీ ఇంతా వెళ్లి అల్లు అర్జున్ ను పరామర్శించిందని ఫైర్ అయ్యారు. బహుశా ఈ విషయాన్ని చిరంజీవి మనసులో పెట్టుకున్నారో ఏమో..!
ఇంతపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సినిమా పరిశ్రమను కాపాడేందుకు సహజంగా చిరంజీవి ముందుంటారు. కానీ ఇవాల్టి సమావేశానికి మాత్రం చిరంజీవి హాజరు కాకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అల్లు అర్జున్ కూడా తన కుటుంబసభ్యుడే కాబట్టి.. కుటుంబ వ్యవహారాన్ని రచ్చ చేసుకోవడం ఇష్టం లేకే చిరంజీవి దూరంగా ఉన్నారని కొంతమంది భావిస్తున్నారు. అయితే త్వరలోనే చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసేందుకు బీజేపీ రెడీ అవబోతోందని.. ఇలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరగడం మంచి సంకేతాలు ఇవ్వదనే కారణంతోనే చిరంజీని దూరంగా ఉన్నారని కొంతమంది భావిస్తున్నారు. ఏదైతేనేం ఈ సమావేశానికి చిరంజీవి దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.