Manchu Family: ముదురుతున్న మంచు ఫ్యామిలీ గొడవ… తీర్చేవాళ్లెవరు..?

తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. భక్తవత్సలం నాయుడిగా ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన మోహన్ బాబు (Manchu Mohan Babu) తన స్వయంకృషితో హీరో స్థాయికి ఎదిగారు. ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోనూ రాణించారు. విద్యాసంస్థలు నెలకొల్పి వాటిని అగ్రగామిగా తీర్చిదిద్దారు. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెను కూడా నటులుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్లు చేసిన కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. జయాపజయాలు సహజం. మోహన్ బాబు క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ల కుటుంబంలోనే ఆ క్రమశిక్షణ లోపించింది.
మంచు కుటుంబంలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. దీంతో రోడ్డుమీదికి వచ్చి అందరూ బాహాబాహీ తలపడుతున్నారు. అసలు గొడవకు మూలకారణం ఫలానా అని ఎవరికీ తెలీదు. అన్నదమ్ములు గొడవ పడుతున్నారంటే సహజంగా ఆస్తి కోసమే అని చెప్పుకుంటూ ఉంటారు. బహుశా మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఆస్తుల్లో వాటాలకోసమే ఇప్పుడు గొడవ పడుతున్నారని అందరూ అనుకుంటున్నారు. జల్ పల్లిలోని నివాసంలో మంచు మనోజ్ ను విష్ణు, మోహన్ బాబు తదితరులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని సమాచారం. తనకు కరెంటు లేకుండా చేస్తున్నారని.., వాటర్ కనెక్షన్ లేకుండా పీకేశారని తాజాగా మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు పోలీసులకు వీలు లేకుండా పోయింది. ఆ మధ్య బౌన్సర్లు మోహరించి తలపడినప్పుడు మాత్రమే పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకూడదని హెచ్చరించారు. మరోవైపు జర్నలిస్టును కొట్టిన కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఏ క్షణమైనా మోహన్ బాబును అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే మోహన్ బాబు దుబాయ్ వెళ్లారని, బెంగళూరులో ఉన్నారని వార్తలందుతున్నాయి. ఇదే సమయంలో మంచు మనోజ్ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లో లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఇంత గొడవ జరుగుతున్నా ఇండస్ట్రీలో ఒక్కరు కూడా దాన్ని పరిష్కరించేందుకు చొరవ తీసుకోవట్లేదు. పైగా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ లో బిజీగా ఉంది. మోహన్ బాబు వైపు దృష్టి పెట్టే అవకాశం కనిపించట్లేదు. మరోవైపు మోహన్ బాబు కూడా ఇండస్ట్రీలో ఎవరి సహాయమూ కోరినట్లు లేరు. దీంతో ఇండస్ట్రీ పెద్దలు కూడా తమకెందుకులే అనో ఫీలింగులో ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను మోహన్ బాబు కుటుంబసభ్యులే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీ పెద్దలెవరూ జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేరు. మరి ఈ సమస్య ఎప్పుడు సెట్ అవుతుందో.. ఎలా సెట్ అవుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.